ఆర్టీఐ వేస్తే బూతుపురాణమా
- ప్రజాధనం లెక్కలు అడిగితే దుర్భాషలా..?
- సమాచారం కోరితే అధికార పార్టీ నాయకుడి ఆగ్రహం..?
- ప్రశ్నించే హక్కును కాలరాస్తారా..?
వెంకటాపూర్, నవంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ నిధుల(Government funds) వినియోగంపై సమాచారం కోరిన ఓ వ్యక్తిపై అధికార పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు దుర్భాషలాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలోని ఓ గ్రామపంచాయతీకి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలు తెలుసుకునేందుకు ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసుకోగా, సదరు వ్యక్తిని ఆ నాయకుడు అసభ్య పదజాలంతో దూషించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
గ్రామపంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన ఖర్చుల వివరాలు తెలుసుకోవడం ప్రతి పౌరుడి హక్కు. ప్రజాధనం ఎలా ఖర్చవుతుందో తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడంలో ఎలాంటి తప్పులేదు. అలాంటిది సమాచారం అడిగిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితేనే నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటే సామాన్యులు తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నాయకులు సమాచారం కోరిన వారిని ప్రోత్సహించాల్సింది పోయి దూషణలకు దిగడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీ నిధుల ఖర్చుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.