ఆశాల సమస్యలు పరిష్కరించాలి
మునుగోడు,నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రజారోగ్య రంగంలో(Public Health Sector) ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలను(ASHA Workers' Issues) ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ(CITU) జిల్లా కమిటీ సభ్యుడు వరీకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక సహాయకులకు సమ్మె నోటీసు అందజేసి మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత(Job security) కల్పించాలన్నారు.
ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశాలకు పదోన్నతులు కల్పించాలని, రెండో పీఆర్సీలో కనీస వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను ఆశాలకూ వర్తింపజేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల కన్వీనర్ ఏదుళ్ల సునీత, ఆశా వర్కర్స్ యూనియన్ మునుగోడు మండల అధ్యక్షురాలు వనం నిర్మల, ఉపాధ్యక్షురాలు కమలమ్మ, కవిత, మమత, కమల, నాంపల్లి మండల నాయకురాళ్లు కవిత, మమత, రేణుక, సైదమ్మ, సునంద, అంజమ్మ, చిన్నమ్మ, సునీత, ఇందిర తదితరులు పాల్గొన్నారు.