నేర నియంత్రణకు పటిష్ట చర్యలు
పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి
నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి టౌన్, నవంబర్ 10 (విజయక్రాంతి): నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ (SP Sirisetti Sankeerth) పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌ల నివారణకు రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోక్సో కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, షీ టీమ్స్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, అలాగే ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించే పీఎం రాహత్, రహవీర్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పీఎం రాహత్ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్యం, ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడిన వారికి రహవీర్ పథకం కింద రూ.25 వేల ప్రోత్సాహకం అందుతుందని వివరించారు. అత్యవసర సమయంలో 112కు సమాచారం అందించాలని సూచించారు.
సీసీ టీఎన్ఎస్ లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాల ఛేదనలో వేగం పెంచాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ ఏ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, వర్టికల్ డీఎస్పి రెహమాన్, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.