అధిక ధరలకు బియ్యం అమ్మితే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
లక్షేట్టిపేట,నవంబర్ 10 (విజయక్రాంతి) : ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే బియ్యాన్ని(Rice) అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షేట్టిపేటలో ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్(Rice Sales Outlet) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ....ప్రజా శ్రేయస్సులో భాగంగా ప్రభుత్వం బియ్యం ధరల నియంత్రణ చర్యలు చేపట్టిందన్నారు.
ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ నిర్ణీత ధరకే విక్రయాలు జరిగేలా రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని తెలిపారు.
26 కిలోల బరువుతో కూడిన బి.పి.టి. న్యూ రైస్ బ్యాగ్ ను రూ. 1352, హెచ్.ఎం.టి. స్టీమ్ బియ్యం బస్తా రూ. 1898, జై శ్రీరామ్ పాత బియ్యం రూ. 2028 చొప్పున అవుట్ లెట్ ద్వారా నిబంధనల ప్రకారం విక్రయాలు జరుపాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాములు,రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు నల్మాసు కాంతయ్య, కొత్త వెంకటేశ్వర్లు,రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటాపలుకుల సత్తయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.