గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ప్రాజెక్టుతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
వెంకటాపూర్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లో జెడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ విజయంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నీటి పొదుపు, పునర్వినియోగం అనే ఉప అంశంలో భాగంగా ‘గ్రౌండ్ వాటర్ రీఛార్జ్’ అనే శీర్షికతో విద్యార్థులు ప్రాజెక్టును రూపొందించారు. ఇంకుడు గుంతల ప్రాముఖ్యత, భూగర్భ జలాల పెంపులో వాటి పాత్రపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, వివరాలతో నివేదికను రూపొందించి పోటీల్లో ప్రదర్శించారు.
ఈ ప్రాజెక్టు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు పి శ్రావ్య, ఎం స్వాతిలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక, గైడ్ టీచర్ కిరణ్ కుమార్, సీనియర్ ఉపాధ్యాయులు బాబురావు, ఫిరోజ్, సంధ్యారాణి, అంబేద్కర్, వేణు, కిషోర్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.