గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం:ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
రూ.20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం
అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శన
బూర్గంపాడు,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) తెలిపారు. బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు సింగారం, సందేళ్ల రామాపురం గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ల(CC Roads)ను శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గత రహదారుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు సులభతరమవుతాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో మట్టి రోడ్లతో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు సీసీ రోడ్ల నిర్మాణంతో తొలగుతాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు.
అంగన్వాడీ చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విద్యాబోధన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.