రిటైర్మెంట్ తర్వాత జర్నలిస్టు అవతారమా..!

21-11-2026 | 07:51pm

వెంకటాపూర్‌ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి వ్యాఖ్యలపై చర్చ

కొన్ని నెలల్లో వస్తున్నా.. మీరు సిద్ధంగా ఉండాలంటూ వ్యాఖ్యలు.?

ఉద్యోగంలో ఉండగానే జర్నలిజం వ్యవహారాలా..

వెంకటాపూర్, నవంబర్ 21 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపూర్ మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి(Government teacher) వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఆయన, ఆ తర్వాత పూర్తిస్థాయిలో జర్నలిస్టుగా(Journalist) మారనున్నట్లు కొంతమంది విలేకరులతో చెబుతున్నారనే ప్రచారం మండలంలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

'నేను వస్తే ఇక దున్నుడే'..

కొన్ని నెలల్లో రిటైర్మెంట్ తీసుకొని వస్తున్నానని, అందరూ సిద్ధంగా ఉండాలని, తాను వస్తే మండలంలో దున్నుడే ఉంటుందని, అందుకు మీ సహకారం కావాలని ఆయన చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటి? నిజాయితీగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమా.? లేక వ్యక్తిగత వ్యవహారాలకు జర్నలిజాన్ని వేదికగా చేసుకోవడమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగంలో ఉండగానే జర్నలిజం ఆరోపణలు!

ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే జర్నలిజం కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారా.? విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధిస్తున్నారా.? పాఠశాల విధులకు ఆటంకం కలుగుతోందా.? అనే అంశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

విద్యాశాఖ విచారణ చేపట్టాలి

ప్రభుత్వ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇతర వృత్తిపరమైన కార్యకలాపాలకు సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయి? వాటి ఉల్లంఘన జరిగిందా.? అనే అంశాలను అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవాలు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అనవసర ప్రచారానికి తెరదించాలని అంటున్నారు.

రిటైర్మెంట్ తర్వాత ఏం జరగబోతోంది.?

ఇప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తుంటే, పదవీ విరమణ తర్వాత ఆయన వ్యవహారశైలి ఎలా ఉండబోతోందన్న చర్చ మండలంలో సాగుతోంది. జర్నలిజం అంటే ప్రజా సమస్యలను ప్రశ్నించడం, ప్రజలకు వాస్తవాలను అందించడం. అది వ్యక్తిగత కక్షలకు, బెదిరింపులకు వేదిక కాకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఉపాధ్యాయుడి వివరణ తీసుకోవడంతో పాటు, విద్యాశాఖ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు