ఒక్కొక్కరి నెత్తిన రూ.3 లక్షల అప్పు!
- * బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఎమ్మెల్యే రోహిత్ ఫైర్
- * మీ రెండు చేతులతో నిండు మనస్సుతో ఆశీర్వదించండన్న రోహిత్
- * కుటుంబ సభ్యుడిలా అన్నింటిలో తోడుంటా
- * 918 మంది అర్హులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
పాపన్నపేట, నవంబర్17: గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కొక్కరి నెత్తిన రూ.2 నుంచి 3 లక్షల అప్పు చేసి, కేసీఆర్ కుటుంబం మాత్రం రూ.కోట్లు దండుకున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు(MLA Rohit Rao) మండిపడ్డారు. మంగళవారం పాపన్నపేట మండల కేంద్రంలోని మంజీరా గార్డెన్లో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై 918 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో కేసీఆర్ ఏడుపాయలకు వచ్చిన పాపాన పోయాడా అని మండిపడ్డారు. మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాడన్నారు. మెదక్ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.
మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడు నాపై ఉండాలని, మీ రెండు చేతులతో ఆశీర్వదించండని వేడుకున్నాడు. కుటుంబ సభ్యుల అన్నిట్లో మీకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. పింఛన్ అంటే కేవలం నెలనెలా అందే ఆర్థిక సాయం మాత్రమే కాదని.. వృద్ధులకు జీవన భరోసా.. దివ్యాంగులకు అండ.. నిరుపేద కుటుంబాలకు కొండంత ధైర్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ పావని గౌడ్, సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షులు శ్రీధర్, సర్పంచులు రజిత రాజశేఖర్, శ్రీనివాస్, పద్మ రమేష్, నాయకులు గోవింద్ నాయక్, తహసీల్దార్ సతీష్, వివిధ గ్రామాల కార్యదర్శులు, తదితరులున్నారు.