ప్రజా సమస్యలు పట్టించుకోకుండా.. వివాదాస్పద వ్యాఖ్యలతో కాలయాపన!
ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వంపై విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో కాలయాపన చేయడం సరికాదని బీఆర్ఎస్(BRS) రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్ర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. శనివారం ఆలేరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా విద్యుత్ కోతలు, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని, మిగిలిన కొద్దిపాటి పంటలనైనా కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి మాట్లాడే భాష, వ్యాఖ్యలపైనే మేధావులు చర్చించే పరిస్థితి రావడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, 22ఏ భూముల సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. విమర్శలకు పరిమితం కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పుట్ట మల్లేష్, గంగుల శ్రీనివాస్, పాకాల మౌనిక హరీష్, యాట శివ, బీజాని కళ్యాణి మధు యాట మల్లేష్, వెంకటయ్య, రచ్చ రామనర్సయ్య, పూల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.