శంకర్‌పల్లిలో ఫ్యూచర్ సిటీ పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్..
సరైన పత్రాలు లేని 47 వాహనాలు గుర్తింపు..
సీపీ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశాలతో రెండు కాలనీల్లో 70 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు..
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరి నుంచి 4 లీటర్ల మద్యం స్వాధీనం..
చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో ఆపరేషన్..
శంకర్ పల్లి: నవంబర్ 21(విజయక్రాంతి): అసాంఘిక కార్యకలాపాలను(antisocial activities) అరికట్టడం, ప్రజల భద్రతను మరింత పెంచడం లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ పోలీసులు(Future City Police) శనివారం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్(Shankarpally Police Station) పరిధిలోని గణేష్ నగర్ కాలనీ, గురునానక్ కాలనీల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి(Future City Police Commissioner Dr. Tarun Joshi) ఆదేశాల మేరకు చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేదా సరైన ధ్రువపత్రాలు లేని 47 వాహనాలను పోలీసులు గుర్తించారు.
వీటిలో 45 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. తదుపరి పరిశీలన కోసం వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఇద్దరు వ్యక్తుల నుంచి 4 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయనున్నారు.
ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో చేవెళ్ల జోన్‌కు చెందిన 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చేవెళ్ల ఏసీపీ కిషన్ స్వయంగా తనిఖీల్లో పాల్గొనగా శంకర్‌పల్లి ఇన్‌స్పెక్టర్ జి. రుద్వీర్ కుమార్ పోలీసు బృందాలతో కలిసి తనిఖీలు నిర్వహించారు.కాలనీల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేయడం, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను కలిగి ఉండాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తమ ప్రాంతాల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు కోరారు.