ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆగ్రహం
సిద్దిపేట –జనగాం ప్రధాన రహదారిపై రాస్తారోకో
తహసీల్దార్ హామీతో సద్దుమణిగిన ఆందోళన
చేర్యాల, నవంబర్ 21 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో(Grain procurement) జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులు(Farmers) రోడ్డు ఎక్కిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది .చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్ రోడ్ వద్ద సిద్దిపేట–జనగామ ప్రధాన రహదారిపై(Siddipet–Jangaon Main Road) వేచరేణి గ్రామ రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా తూకం వేయకపోవడం లేదని,కేంద్రాలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా కనీసం తమ ధాన్యాన్ని చూసే నాథుడే లేకుండా పోయారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే నిలిచిపోవడంతో రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు మొద్దు నిద్ర విడి,వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న చేర్యాల తహసీల్దార్ అక్కడికి చేరుకుని.. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.తహసిల్దార్ హామీతో రైతులు ఆందోళన విరమించారు.