కాంగ్రెస్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో కీలక రాజకీయ కదలికలకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 29న న్యూఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( Congress Working Committee) సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) అధ్యక్షతన జరిగే ఈ భేటీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన Special Intensive Revision (SIR)పై కాంగ్రెస్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్‌పై తదుపరి కార్యాచరణ ఏంటి? పార్లమెంట్‌లో ఆయన తొలగింపును కోరుతూ మరోసారి తీర్మానం దిశగా వెళ్లాలా? అనే అంశాలపై CWCలో పార్టీ నేతలు చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఇప్పటికే రెండు సభల్లో removal motion కోసం తాజా నోటీసు దిశగా కసరత్తు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు వంటి నేతల పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకోనుంది. అదే సమయంలో INDIA కూటమి పార్టీలతో సమన్వయంపైనా CWCలో చర్చ జరిగే అవకాశం ఉంది. జ్ఞానేశ్ కుమార్ అంశంపై ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడం, పార్లమెంట్‌లో తదుపరి వ్యూహాన్ని రూపొందించడం వంటి అంశాలు కూడా భేటీలో ప్రస్తావనకు రావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే CECను తొలగించే ప్రక్రియ సాధారణ రాజకీయ తీర్మానంతో పూర్తయ్యేది కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానానికి సమానమైన పార్లమెంటరీ ప్రక్రియ అవసరం. రెండు సభల్లోనూ రాజ్యాంగపరమైన ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే 2026 మార్చిలో జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar) తొలగింపునకు సంబంధించిన నోటీసును లోక్‌సభ స్పీకర్ అంగీకరించలేదు. ఇప్పుడు మరోసారి ఈ అంశం రాజకీయంగా తెరపైకి రావడంతో సెప్టెంబర్ 29 CWC సమావేశంపై ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 29 భేటీలో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాన్ని ఖరారు చేస్తుంది? INDIA కూటమి పార్టీలతో కలిసి పార్లమెంట్‌లో తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.