10 లక్షల మంది వస్తే వ్యాపారాలెలా సాగుతాయి?
- రాహుల్‌గాంధీకి మరోమారు సీటీఐ లేఖ
- అక్టోబర్ 10 నిరసనలతో 3వేల కోట్లు నష్టం
- నవంబర్ 1 సభకు ఉదయం 10 నుంచి 5 వరకే అనుమతి
- రెచ్చగొట్టే ప్రసంగాలొద్దు, హింసకు తావీయవద్దన్న పోలీసులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: నవంబర్ 1న కాంగ్రెస్ కూటమి(Congress alliance) చేపట్టబోయే ర్యాలీకి 10 లక్షల మంది ఢిల్లీకి వస్తే తాము వ్యాపారం ఎలా చేసుకోవాలని సీటీఐ (ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ)(Chamber of Trade and Industry) ప్రశ్నించింది. ఈ మేరకు మంగళవారం మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) రాసిన లేఖను రాసింది. దీపావళి పండుగ(Festival of Diwali) సీజన్ సందర్భంగా ర్యాలీని నిర్వహిస్తే రామ్ లీలా మైదానం(Ramlila Maidan) పరిసరాల్లో ఉన్న మార్కెట్ల వ్యాపారం భారీగా దెబ్బతిని రూ. 10వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
ర్యాలీని నవంబర్ 10కి వాయిదా వేయాలని మరోమారు విజ్ఞప్తి చేసింది. లేదంటే నిరసన ప్రదేశాన్ని వాణిజ్య ప్రాంతాలకు(commercial areas) దూరంగా మార్చాలని కోరింది. ఈ లేఖ నకలు ప్రతిని రాహుల్ తోపాటు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు(Mallikarjun Kharge) కూడా పంపామని, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించాలని కోరామని సీటీఐ ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ తెలిపారు. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల కారణంగా రూ. 3వేల కోట్ల నష్టం వాటిల్లిందని గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాసిన లేఖపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో మరోసారి లేఖ రాసినట్లు గోయల్ తెలిపారు.
కాగా అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు రామ్ లీలా మైదానంలో నిర్వహించే కార్యక్రమాల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతిని పొందింది. అదే సమయంలో నవంబర్ 1 ర్యాలీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేయలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. నియమ నిబంధనలకు లోబడి గతంలో ఇచ్చిన అనుమతిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అశోకా హోటల్ ప్రైవేట్ ఆస్తి కాబట్టి అక్కడ ప్రతిపాది మాక్ పార్లమెంట్ కార్యక్రమంపై నిర్ణయం హోటల్ వారిదేనని పోలీసులు వర్గాలు స్పష్టం చేశాయి.
పోలీసుల షరతులు..
నవంబర్ 1న రామ్ లీలాలో కాంగ్రెస్ (ఇండి కూటమి) సభకు పోలీసులు కొన్ని కఠిన నియమ నిబంధనలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే నిర్వహించుకోవాలన్నారు. కులం, మతం పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దన్నారు. సభ నిర్వహణ ముందురోజు, అదే రోజు రాత్రిళ్లు ఆ ప్రాంతంలో బస చేసేందుకు అనుమతి లేదన్నారు. సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేయాలని, సభకు హాజరయ్యే వారికి మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలని, వాలంటీర్లను నియమించుకోవాలని, హింసకు తావులేకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా సభను నిర్వహించుకోవాలని సూచించారు.
రామ్ లీలా మైదానం నుంచి ఇతర ప్రాంతానికి ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సభకు వచ్చే వాహనాలను పోలీసులు నిర్దేశించిన స్థలంలోనే పార్కింగ్ చేసుకోవాలన్నారు. షరతుల లో ఏవైనా ఉల్లంఘనలు జరిగితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.