నిరసనతో వ్యాపారులకు 11వేల కోట్ల నష్టం!
- ర్యాలీని వాయిదా వేసుకోవాలన్నా ఇండీ కూటమి వినలేదు
- దీపావళి వేళ వ్యాపారం దెబ్బతీశారు.. ఢిల్లీ ట్రేడర్ల ఆవేదన
- వ్యాపారుల పొట్ట కొట్టారు.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
- షాపులను బీజేపీనే కుట్రపూరితంగా మూసేయించిందన్న కాంగ్రెస్
- తెరిచి ఉంచిన షాపుల్లోనూ తమవాళ్లు షాపింగ్ చేశారని వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 2: కాంగ్రెస్ నేతృత్వంలో ఇండీ కూటమి(INDIA Alliance) ఆదివారం ఢిల్లీలో చేపట్టిన నిరసన ర్యాలీపై మాటల యుద్ధం సాగుతున్నది. ముఖ్యంగా అక్కడి వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్లో నిరసనల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటాయని, వాయిదా వేసుకోవాలని పదే పదే చెప్పినా ఇండీ కూటమి నేతలు వినిపించుకోలేదని.. ఫలితంగా ఒక్కరోజు నిరసన కారణంగా రూ. 11వేల కోట్ల నష్టం వాటిల్లిందని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(Chamber of Trade and Industry) (సీటీఐ) తెలిపింది.
ర్యాలీ ప్రారంభమైన కన్నాట్ ప్లేస్ నుంచి రామ్‌లీలా మైదాన్(Ramlila Maidan) వరకు ఉదయం షాపులను తాము తెరిచి ఉంచినప్పటికీ ట్రాఫిక్ జామ్, పార్కింగ్ వల్ల కొనుగోలు దారులు ఎవరూ రాలేదని.. దాని వల్ల షాపులను బంద్ పెట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. నిరసనల పేరిట వ్యాపారుల పొట్ట కొట్టారని కాంగ్రెస్‌పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కుట్రపూరితంగా బీజేపీనే షాపులను మూసివేయించిందని, తమ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముందస్తుగా ఓ పిలుపునిచ్చారని, నిరసనకు వచ్చేవాళ్లు తప్పకుండా దుకాణాల్లో షాపింగ్ చేయాలని అందులో చెప్పారని కాంగ్రెస్ పేర్కొంది. తెరిచి ఉంచిన దుకాణాల్లో తమ వాళ్లు కొనుగోళ్లు చేశారని, దీని వల్ల వ్యాపారులకు లాభమే జరిగిందని తెలిపింది.
80 శాతం షాపులు మూత
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరిట ఇండీ కూటమి ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కన్నాట్ ప్లేస్ నుంచి రామ్ లీలా మైదాన్ వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ నిరసన వల్ల తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని, పైగా ఇది దీపావళి సీజన్ కావడంతో భారీగా నష్టం వాటిల్లుతుందని, పండుగ తర్వాత నిర్వహించుకోవాలని ట్రేడర్లు పదే పదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు ఇండీ కూటమి నేతలను కోరారు. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీకి కూడా వ్యాపారులు లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఓ పిలుపునిచ్చారు. నిరసన ర్యాలీ వల్ల వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగనివ్వబోమని.. నిరసనకు వచ్చేవాళ్లంతా అక్కడి షాపుల్లో షాపింగ్ చేయాలన్నారు. కానీ, ఆదివారం ర్యాలీ వల్ల ఢిల్లీలో పెద్ద ఎత్తున షాపులు మూతపడ్డాయని సీటీఈ చైర్మన్ బ్రజేష్ గోయల్ సోమవారం మీడియాతో అన్నారు. ర్యాలీ ప్రభావం అక్కడి చుట్టపక్కల ప్రాంతాల్లోని 25 ప్రధాన మార్కెట్లపై పడిందని తెలిపారు. ఈ మార్కెట్లలో సుమారు 3 లక్షల దుకాణాలు ఉండగా.. 80శాతం దుకాణాలు మూసేయాల్సి వచ్చిందని, దీనికి కారణం ర్యాలీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, పార్కింగ్ సమస్య ఉత్పన్నమవడం, జనం షాపింగ్‌కు రాకపోవడమేనని పేర్కొన్నారు.
మొత్తం ఒక్కరోజులో 10వేల కోట్ల నుంచి 11వేల కోట్ల వ్యాపారానికి నష్టం జరిగిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. కన్నాట్ ప్లేస్ ట్రేడర్స్ యూనియన్ అధ్యక్షుడు అతుల్ భార్గవ మాట్లాడుతూ.. గతంలో దసరా సమయంలో కూడా ఇలా నిరసనలు చేపట్టి వ్యాపారాలు దెబ్బతీశారని, ఇప్పుడు దీపావళి వేళ కూడా తమ వ్యాపారాలు నడవకుండా చేశారని పేర్కొన్నారు. తాము ఏ పార్టీ నిరసనలకూ వ్యతిరేకం కాదని, పండుగ సీజన్ వేళ వ్యాపారాలు దెబ్బతీయొద్దన్నదే తమ విజ్ఞప్తి అని అన్నారు. గత కొన్నిరోజులు కన్నాట్ ప్లేస్ మీదుగా జరుగుతున్న నిరసన ర్యాలీల వల్ల వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయని.. ఈ ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు తీయకుండా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు.
వ్యాపారుల పొట్ట కొట్టారు: నడ్డా
ఇండీ కూటమిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల పేరిట పండుగ సీజన్లో వ్యాపారుల పొట్ట కొట్టారని రాహుల్ గాంధీపై బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. దేశంలో అల్లర్లను సృష్టించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని ఆయన దుయ్యబట్టారు. ‘ధన్‌తేరాస్, దీపావళి, ఛట్ ఫూజ వంటి పండుగ సమయాల్లో చిన్నవ్యాపారులు కొంత మెరుగైన జీవనోపాధి కోసం ఎదురుచూస్తుంటారు. వారి గురించి రాహుల్‌గాంధీ పట్టించుకోలేదు. వ్యాపారులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టుపట్టి ఆయన నిరసన ర్యాలీ చేపట్టారు. చిన్నవ్యాపారుల ఇంట్లో పొయ్యి వెలగడం కంటే రాహుల్ గాంధీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం’ అని నడ్డా విమర్శించారు.
వ్యాపారులకు లాభం కలిగించాం: జైరాం రమేశ్
ఇండీ కూటమి నిరసన ర్యాలీని చూసి తట్టుకోలేక బీజేపీ విమర్శలు చేస్తున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. నిరసనల వల్ల మార్కెట్లు మూతపడుతాయంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. ‘వ్యాపారుల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రత్యేక పిలుపు కూడా ఇచ్చారు. నిరసన ర్యాలీకి వచ్చేవాళ్లంతా చుట్టుపక్కల దుకాణాల్లో షాపింగ్ చేయాలని, దాని వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చాలని ఆయన కోరారు.
అయితే.. బీజేపీ మాత్రం కుట్ర పన్ని ముందస్తుగా చాలా దుకాణాలను మూసివేయించింది. తెరిచి ఉంచిన దుకాణాల్లో మా నాయకులు, కార్యకర్తలు షాపింగ్ చేశారు. దీని వల్ల వ్యాపారులకు లాభమే కలిగింది’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. తమ నిరసన ర్యాలీకి చాలామంది వ్యాపారులు మద్దతు కూడా తెలిపారని ఆయన అన్నారు.