మా రిపబ్లికన్లు ఓడితే ‘మిస్టర్ వీటో’ అవుతా

03-11-2026 | 05:15am

ఏది ఏమైనా డెమోక్రాట్ల ఆటలు సాగనివ్వ

నా విశ్వరూపం చూపిస్తా: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్, నవంబర్ 2: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో(midterm elections) తమ రిపబ్లికన్ పార్టీ(Republican Party) అభ్యర్థులు ఓడిపోతే, కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు పట్టు సాధిస్తే తాను విశ్వరూపం చూపిస్తానని.. ‘మిస్టర్ వీటో’గా అవతారం ఎత్తుతానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హెచ్చరించారు. ఏది జరిగినా తాను మాత్రం డెమోక్రాట్ల ఆటలు సాగనివ్వబోనని, వాళ్లను కాళ్లబేరానికి వచ్చేలా చేస్తానని ఆయన అన్నారు. అమెరికాలో మంగళవారం మధ్యంతర ఎన్నికలు(midterm elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి ట్రంప్‌కు కళ్లెం వేయాలని డెమోక్రటిక్ పార్టీ ప్రయత్నిస్తున్నది.

ప్రీ పోల్ సర్వేల్లోనూ ట్రంప్ పార్టీకి షాక్ తప్పదని వార్తలు వస్తున్నాయి. సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ తగ్గితే.. ఆ మేరకు ట్రంప్ అధికారాలకు చెక్ పెట్టవచ్చని డెమోక్రాట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్లు ఓడిపోయి.. డెమోక్రాట్లు ఎక్కువ సీట్లు సాధించినా.. తాను మాత్రం వెనక్కి తగ్గబోనని చెప్పారు. ‘మిస్టర్ వీటో’గా తన కొత్త రూపం చూపిస్తానని, కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు ఆమోదించే బిల్లులను అధ్యక్షుడిగా తనకు ఉన్న ‘వీటో’ అధికారాలతో అడ్డుకుంటానని ఆయన హెచ్చరించారు.

అవసరమైతే రెండు నెలల పాటు వీటో అధికారాన్ని ఉపయోగిస్తానని.. చివరికి ఒప్పందం కోసం డెమోక్రాట్లే తన వద్దకు వస్తారని వ్యాఖ్యానించారు. కావాలనే సర్వేలన్నీ తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకే ఎక్కువ సీట్లు వస్తాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. తనను తాను ‘మిస్టర్ టారిఫ్’ అని, ‘ప్రెసిడెంట్ ఆఫ్ పీస్’ అని చెప్పుకుంటూ వచ్చిన ఆయన.. ఇప్పుడు ‘మిస్టర్ వీటో’గా అవతారమెత్తుతానని చెప్పడం చర్చనీయాంశమైంది.

మూడోసారి ప్రెసిడెంట్ కావాలని ఉంది

గతంలో ఓసారి అమెరికా ప్రెసిడెంట్‌గా పనిచేసిన ట్రంప్ ఇప్పుడు రెండోసారి కొనసాగుతున్నారు. అమెరికా చట్టం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి వీల్లేదు. అయితే.. తనకు మాత్రం మూడోసారి అమెరికా ప్రెసిడెంట్  కావాలని ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘మళ్లీ ప్రెసిడెంట్‌గా పోటీ చేయాలని ఉంది. కానీ, నిబంధనలు సహకరించేలా లేవు. ఏదైనా కలిసి వస్తే మాత్రం తప్పకుండా బరిలోకి దిగుతాను’ అని ఆయన అన్నారు. 

మరిన్ని వార్తలు