భారత్–ఇజ్రాయెల్ రక్షణ ఒప్పందం

18-11-2026 | 06:39pm

న్యూఢిల్లీ: భారత నౌకాదళ రక్షణ(Indian Navy Defence) సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (Israel Aerospace Industries)తో రూ.1,976.40 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. భారత యుద్ధ నౌకలపై వినియోగిస్తున్న బరాక్ పాయింట్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు పాతబడిన సాంకేతిక పరికరాల నిర్వహణను ఈ ఒప్పందం ద్వారా చేపట్టనున్నారు.

భారత నౌకాదళంలోని యుద్ధ నౌకలకు రక్షణ కవచంగా పనిచేసే బరాక్ పాయింట్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్‌(Barak Point Defence Missile System)ను మరింత సమర్థంగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యవస్థల్లో సాంకేతిక నవీకరణలు చేపట్టి, పాతబడిన విడిభాగాలు, పరికరాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.

రక్షణ రంగంలో భారత్, ఇజ్రాయెల్(India Israel) మధ్య సాంకేతిక సహకారం ఇప్పటికే బలంగా ఉంది. తాజా ఒప్పందంతో ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యం మరో ముందడుగు వేసింది. సముద్ర మార్గాల్లో ఎదురయ్యే వైమానిక ముప్పులను ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం వద్ద ఉన్న రక్షణ వ్యవస్థల ఆధునీకరణకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ఈ ఒప్పందం ద్వారా కొత్త క్షిపణుల కొనుగోలు కాకుండా ఇప్పటికే వినియోగంలో ఉన్న బరాక్ రక్షణ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడం, దాని నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నారు.

మరిన్ని వార్తలు