ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రారంభం
- ఈ నెల 20 నుంచి రెండు వారాల పాటు దరఖాస్తుల స్వీకరణ
- అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మంథని, నవంబర్ 18(విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) ద్వారా పట్టణ ప్రజలకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో మంథని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ పథకం నమోదు ప్రక్రియ, అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాల వివరాలను వెల్లడించారు.
ఈ నెల 20వ తేదీ నుంచి రెండు వారాల పాటు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని, ప్రతి కుటుంబం నుంచి కుటుంబ పెద్ద లేదా ఒక కుటుంబ సభ్యుడు నమోదు చేసుకోవచ్చని వివరించారు. రేషన్ కార్డు ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేని వారు కూడా అర్హులేనని, కార్డు లేని వారు ఆధార్ కార్డు సమర్పించాలని సూచించారు.
నమోదుకు అవసరమైన పత్రాలు
రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ ఆధార్ కార్డు వివరాలు, మొబైల్ నంబర్..
వార్డుల వారీగా నమోదు కేంద్రాలు
1వ వార్డు – జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్, చైతన్యపురి కాలనీ
2వ వార్డు – ఎంపీడీఓ కార్యాలయం
3వ వార్డు – బాలుర కళాశాల మైదానం
4వ వార్డు – ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, గంగాపురి
5వ వార్డు – అంగన్‌వాడీ కేంద్రం, కుచిరాజ్‌పల్లి
6వ వార్డు – నాగులమ్మ ఆలయ ప్రాంతం
7వ వార్డు – హనుమాన్ ఆలయ ప్రాంతం, రావుల చెరువు కట్ట
8వ వార్డు – చింతచెట్టు ప్రాంతం, పోచమ్మవాడ
9వ వార్డు – మహాలక్ష్మి ఆలయ ప్రాంతం
10, 11, 12, 13వ వార్డులు – మున్సిపల్ కార్యాలయం, మంథని.
ఈ సందర్భంగా చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. తమకు కేటాయించిన వార్డు నమోదు కేంద్రానికి అవసరమైన పత్రాలతో హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు నూకల కమల్, పోతరవేని శ్రీలత, మారుపాక నిహారిక, పెంటరి రాజు, ఎల్లెంకి వంశీధర్ తదితర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.