కుప్పకూలిన బ్యాంక్.. దేశాధ్యక్షుడు ఔట్

08-11-2026 | 05:15am
  1. పరాగ్వేలో యునో బ్యాంక్ కలకలం 
  2. అక్రమంగా రూ. కోట్లకు కోట్లు లోన్లు, నగదు బదిలీలు 
  3. బ్యాంక్‌లో నిధులు ఖాళీ.. రోడ్డునపడ్డ ఖాతాదారులు 
  4. దేశంలో సగం మందికి ఆ బ్యాంక్‌లోనే అకౌంట్స్ 
  5. దేశాధ్యక్షుడు శాంటియాగో పెనాపై తీవ్ర ఆరోపణలు 
  6. అభిశంసన తీర్మానంతో పదవి నుంచి దించేసిన ప్రతిపక్షాలు 
  7. ఆ వెంటనే గృహనిర్బంధంలోకి! 

అసున్సియోన్, నవంబర్ 7: భారీ కుంభకోణం(Massive scam) కారణంగా ఓ బ్యాంక్ కుప్పకూలడం ఏకంగా దేశాధ్యక్షుడి పదవికే ఎసరు తెచ్చింది. దక్షిణ అమెరికాలోని(South America) పరాగ్వే దేశంలో ఈ ఘటన కలకలం రేపుతున్నది. బాధితులు రోడ్ల మీదికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను బ్యాంక్ నిండా ముంచిందని, తాము బతికేదెలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దేశంలోని సగం జనాభా ఖాతాదారులే

పరాగ్వే దేశంలో కొన్నేండ్లుగా యునో బ్యాంక్(Uno Bank) కీలక సేవలు అందిస్తున్నది. దేశ జనాభా దాదాపు 65 లక్షలు కాగా.. ఇందులో సగం మందికి  ఈ బ్యాంక్‌లోనే ఖాతాలు ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో యునో బ్యాంక్(Uno Bank ) డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించడం మొదలుపెట్టింది. 2024లో మరికొన్ని బ్యాంక్‌లను విలీనం చేసుకుంది. ఈ బ్యాంకులో దాదాపు 30 లక్షల మంది ఖాతాదారులు ఉండగా.. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థల లావాదేవీలు కూడా భారీగా జరుగుతుంటాయి. మొత్తం 850 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 7,500 కోట్లు) నిధులు ఇందులో ఉన్నాయి.

వీటిలో పెన్షనర్ల సొమ్మే 380 మిలియన్ డాలర్లు. అయితే.. కొన్నాళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఈ బ్యాంకు రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది. గుర్తుతెలియని వ్యక్తుల పేరిట రూ. కోట్లకు కోట్లు లోన్లు ఇచ్చింది. లావాదేవీలు జరిపింది. ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు ఇటీవల పరాగ్వే దేశ సెంట్రల్ బ్యాంకు గుర్తించింది. కనీస నిల్వలు కూడా లేకుండా యునో బ్యాంకు గల్లా పెట్టెను గుల్ల చేశారని తేల్చింది. ఈ క్రమంలో ఆ బ్యాంక్ వ్యవస్థాపకుడు మిగెల్ వాజ్కెజ్, చైర్మన్ జువాన్ మాన్యుయెల్‌తోపాటు మొత్తం 27 మందిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంక్ స్కామ్ కారణంగా 30 లక్షల మంది ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. దీంతో బాధితులు దేశ రాజధాని అసున్సియోలో రోడ్ల మీదికి వచ్చి ఆందోళనబాట పట్టారు. తిండి గింజలు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లి గవ్వలేదని, ఆకలితో అలమటించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. యునో బ్యాంక్ పతనమవడానికి కారణం దేశాధ్యక్షుడు శాంటియాగో పెనా అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 

దేశాధ్యక్షుడిపై అభిశంసన

యునో బ్యాంక్ పతనం పరాగ్వేలో ఆర్థిక సంక్షోభానికే కాదు రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఆ దేశ అధ్యక్షుడు శాంటియాగో పెనాపై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి.. పదవి నుంచి దించేశాయి. బ్యాంకు పరిస్థితిని ముందే పసిగట్టిన పెనా.. తానే రాజీనామా చేస్తానని ఈ నెల 5న ప్రకటించినప్పటికీ చట్టసభ సభ్యులు మాత్రం వినలేదు. తాజాగా అభిశంసన తీర్మానంతో ఆయనను దించేశాయి. తీర్మానం ఆమోదం పొందిన కొన్ని నిమిషాల్లోనే ఆయనను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సంస్థలో ఆర్థిక వేత్తగా పనిచేసిన శాంటియాగో పెనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యునో బ్యాంక్‌లో పెనాకు పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నాయి. పైగా, బ్యాంక్ కార్యకలాపాలు చూసేవాళ్లంతా ఆయన అనుచరులే.  ప్రస్తుతం బ్యాంక్  పతనమవడం వెనుక దేశాధ్యక్షుడు శాంటియాగో పెనా హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనను చట్టసభల సభ్యులు పదవిలో నుంచి దించేశారు. కాగా, రాజీనామా చేసి తప్పించుకోవచ్చని పెనా ముందస్తుగా వ్యూహం వేశారు.

తన రాజీనామాకు ఆమోదం లభిస్తే.. జీవితకాలం సెనేటర్ పదవి, దాని ద్వారా చట్టపరమైన రక్షణలు దక్కుతాయని భావించారు. అయితే.. అలాంటి రక్షణ చర్యలు కూడా దక్కకుండా సభ్యులంతా మూకుమ్మడిగా అభిశంసన వైపు మొగ్గుచూపారు. పెనాను దించేసి.. అధ్యక్షుడి స్థానంలో  ప్రస్తుత ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానాను ఎన్నుకున్నారు. యునో బ్యాంక్ బాధితులకు కొంత మొత్తంలో చెల్లింపులు జరిపేందుకు కొత్త అధ్యక్షుడు చర్యలు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు