మళ్లీ గెలిపించలేదని ప్రజలపై.. కేసీఆర్ ఫ్యామిలీ పగ!
పదేండ్లలో లక్ష కోట్ల దోపిడీ.. కాసుల కోసం కాళేశ్వరం కట్టి, కూల్చారు
- సీబీఐ విచారణకు మేం ఆదేశిస్తే.. మోదీ దగ్గరికి వెళ్లి అడ్డుకున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
- ఎల్ నినోపై బావబామ్మర్దుల విషప్రచారం
- వాళ్ల నోటి నుంచి ఒక్క నిజమన్నా వచ్చిందా?
- డిసెంబర్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడ్తాం
- ఎల్ నినో, ప్రాజెక్టులపై చర్చించేందుకు రావాలి
- ఢిల్లీ-నోయిడా మాదిరి హైదరాబాద్-లగచర్ల అభివృద్ధి
- యాసంగిలో రైతులు ఆరుతడి పంటలే వేయాలి
- సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల్లో పర్యటిస్తానని వెల్లడి
- వికారాబాద్ జిల్లా హకీంపేట మెగా రైతు మేళాలో ముఖ్యమంత్రి
వికారాబాద్/కొడంగల్, నవంబర్ -7 (విజయక్రాంతి): పదేండ్ల పాటు అధికారంలో ఉండి లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, పాపాల మీద పాపాలు చేశారని కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. కాసులకు కక్కుర్తి పడి కాళేశ్వరాన్ని(Kaleshwaram Project) కట్టి, కూల్చారని దుయ్యబట్టారు. మళ్లీ గెలిపించలేదని ప్రజలపై కేసీఆర్ ఫ్యామిలీ పగబట్టి తప్పుడు ప్రచారానికి దిగుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజలు మరిచిపోలేదని, ఆ పార్టీ నాయకులను ఇంకా నమ్మే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.
‘సారాయి నుంచి మొదలు పెడితే.. లిక్కర్ ఒకడు, నీళ్లు ఒకడు, పాలు ఒకడు, భూములు ఒకడు, గనులు ఒకడు.. ఇట్లా ఇంటిల్లిపాది తెలంగాణను కొల్లగొట్టి లక్ష కోట్లు సంపాదించుకున్నరు. ఏదీ వదలలేదు. దోచుకతిన్నరు. వాళ్లను జనం ఎట్ల మరిచిపోతారు. లారీల కింద నేరెళ్ల దళితులను తొక్కించిన విష యం మరిచిపోతారా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేయించిన విషయం మరిచిపోతారా?’ అని ప్రశ్నించారు. శనివారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండ లం హకీంపేటలో మెగా రైతు మేళాను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మీరు చేసిన పాపాలకు, మీ కాసుల కక్కుర్తికి కాళేశ్వరం బలైపోయి.. మేడిగడ్డ కూలిపోయింది. ఇప్పుడు కరువు సమయంలోనూ ఒక్క రైతుకు కూడా చుక్క నీరు ఇవ్వలేని విధంగా తయారైంది’ అని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన దేవాదుల ప్రాజెక్టు నుంచే ఇప్పుడు కూడా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి ఆరోపణలపై తాము సీబీఐ విచారణ కోరితే.. ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన నిలదీశారు.
బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ వద్ద మోకరిల్లి సీబీఐ విచారణను అడ్డుకున్నారని ఆరోపించారు. ఆనాడు హరీశ్‌రావు గవర్నర్‌ను తీసుకుపోయి కాళేశ్వరం గురించి భజన చేయించుకున్నారని, ఇప్పుడు మేడిగడ్డ గురించి అడిగితే ఎందుకు భయపడుతున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎల్ నినో వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా గోదా వరి నీటిని రైతులకు అందిస్తున్నామని తెలిపారు.
పాలమూరులో గెలిపిస్తే ఏం చేశాడు?
ఆనాడు కరోనా సమయంలో కేసీఆర్ క్రోసిన్, పారాసెటమాల్ గోలీలు వేసుకొమ్మన్నారని, ఆయన మాట విన్నవాళ్లు చనిపోయారని సీఎం రేవంత్ అన్నారు. ఎల్ నినోపై తాము రైతులను ముందస్తుగా అప్రమత్తం చేశామని, తమ మాట విన్న రైతులు లాభాలు పొందుతున్నారని తెలిపారు. ‘అప్పట్లో కేసీఆర్ పాలమూరు నుంచి గెలిస్తే.. తెలంగాణ వస్తుందని, ఈ జిల్లా బాగుపడుతుందని ఆయనను ఎంపీగా గెలిపించాం. తెలంగాణ వచ్చి.. కేసీఆర్ సీఎం అయినా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు.
ఆయన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 30 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది’ అని తెలిపారు. అప్పట్లో గోదావరి జలాలు ఇక్కడికి తీసుకురావాలని.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును దివంగత మాజీ సీఎం వైఎస్ రా జశేఖర్ రెడ్డి చేపట్టారని, ఇందుకోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కాసులకు కక్కుర్తిపడి కేసీఆర్ కాళేశ్వరాన్ని కడి తే బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయిందని ఆయన తెలిపారు.
ఢిల్లీ-నోయిడా మాదిరి హైదరాబాద్-లగచర్ల
కేసీఆర్ హయాంలో కొడంగల్‌కు ఏం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘ఈ నియోజకవర్గంలో బడి, గుడి, సరైన రోడ్డు లేవు.. బీఆర్ఎస్ హయాంలో కొడంగల్‌కు ఇచ్చింది ఏమీలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే.. వారికి ఎందుకంత కడుపుమంట?’ అని ప్రశ్నించారు. ‘ఢిల్లీ పక్కన నోయిడా.. బొంబాయి పక్కన పుణె ఎలా అభివృద్ధి జరిగిందో.. హైదరాబాద్ పక్కన లగచర్ల, కొడంగల్ అభివృద్ధి జరుగుతుంది.
ప్రాజెక్టులు వస్తాయి. మన పిల్లలు ఇంటర్ చదవాలన్నా సుదూర ప్రాంతాలకు పోయేవారు. కానీ, త్వరలో అన్ని ప్రాంతాల నుంచి చదువుకునేందుకు కొడంగల్‌కు వస్తారు. ఇక్కడ పండే కందులు, జొన్నలకు ప్రాముఖ్యం రావాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే నా తాపత్రయం’ అని పేర్కొన్నారు. ఇప్పుడు రూ. 9వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నామని ఆయన చెప్పారు.
డిసెంబర్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఎల్ నినోపై బావాబామ్మర్దులు హరీశ్‌రావు, కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీలో చర్చించేందుకు ఎవరు వస్తారో రావాలి. బావాబామ్మర్దులే కాదు.. పరివారం మొత్తం రావాలి. ఎల్ నినో, కాళేశ్వరంపై చర్చిద్దాం. నిజాలు బయటపెట్టి తాట తీస్తాం’ అని సవాల్ చేశారు. ‘డిసెంబర్లో రెండుమూడు రోజులు ఎల్ నినో, కాళేశ్వరం, గోదావరి-ప్రాణహిత నీళ్ల మీద చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరుతున్నాను’ అని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఏ ఒక్కరోజన్నా నిజాలు మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలు తప్ప వాళ్లకు మరొకటి రావని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడిచి పెట్టినట్లు బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఎన్ని వేషాలు వేసినా తనలా కాలేరని సీఎం రేవంత్ అన్నారు.
‘నాకు ప్రజల అభిమానం ఉందని, నన్ను చూసి ఒకాయన గడ్డం పెంచుకున్నడట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులి కాదు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన ఆయన రేవంత్ రెడ్డి కాలేడు. పది జన్మలు ఎత్తినా ఆయనకు సాధ్యం కాదు. రేవంత్‌రెడ్డి కావాలంటే.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ధైర్యం ఉండాలి’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ‘అయినా నీకు గడ్డం రావడానికే 50 ఏండ్లు పట్టింది. ఇంకా బుద్ధి రావడానికి ఎన్నేండ్లు పడుతయో..’ అని ఎద్దేవా చేశారు.
యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి
రైతుల బాధలు, వారి ఇబ్బందులు తనకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్ నినో ప్రభావంతో ఎండలు పెరగనున్నాయని, యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘ఆరుతడి పంటలు మాత్రమే వెయ్యాలి. వరి పంట వేస్తే నీళ్లు సరిపోవు. జూలై వరకు వానలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నీటిని జాగ్రత్తగా వాడుకుందాం’ అని సూచించారు. తాండూరు కందిపప్పు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుందని, రైతులు అనుకుంటే ఏదైనా సాధించగలరని, అధిక రాబడి వచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు.
సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల్లో పర్యటన
సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజలంతా కలిసి ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చని.. ఎల్ నినోను కూడా కలిసి ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు.
స్టాళ్ల పరిశీలన
రైతు మేళాలో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, పశు సంవర్ధక, మత్స్య శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి వారితో మాట్లాడారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర్ రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి , ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, కాలే యాదయ్య, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేందర్ మోహన్, వికారాబాద్, నారాయణపేట జిల్లా కలెక్టర్లు దీపక్ తివారీ, ప్రియాంక, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తదితరులు పాల్గొన్నారు.