ఈ-20 కాదు.. 420 ఇథనాల్‌ను 31 శాతం కలిపారు?

08-11-2026 | 05:20am
  1.   14 నమూనాల్లో 20 శాతం కంటే ఎక్కువ 
  2. కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
  3. ఆరోపణలను ఖండించిన చమురు సంస్థలు

న్యూఢిల్లీ, నవంబర్ 7: పెట్రోల్‌లో ఇథనాల్‌ను(Ethanol) 20 శాతమే కలుపుతున్నామంటున్న కేంద్ర ప్రభుత్వం(Central Government), చమురు సంస్థలు(Oil companies) దాని కంటే ఎక్కువ కలుపుతూ ప్రజలను భారీగా మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్రంగా ఆరోపించారు. కర్ణాటకలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 14 పెట్రోల్ నమూనాలను(petrol samples) ల్యాబ్‌లో పరీక్షించామని.. 11 నమూనాల్లో 20 శాతానికి మించి ఇథనాల్ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(Indian Oil Corporation) (ఐవోసీఎల్) నమూనాల్లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) నమూనాల్లో 30.5 శాతం, ఇతర సంస్థల నమూనాల్లో 25.5 నుంచి 26.5 శాతం ఇథనాల్ బయట పడిందన్నారు. కేంద్రం, చమురు సంస్థలు ఈ-20 పెట్రోల్ విక్రయించడం లేదని.. 420 పెట్రోల్ విక్రయిస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. నమూనాలను బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు జిల్లాల నుంచి సేకరించినట్లు తెలిపారు. 20 శాతానికి మించి ఇథనాల్ కలుపుతున్న చమురు సంస్థలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

వాహనాల మైలేజీ తగ్గుతుంది.. విడిభాగాలు చెడిపోతాయి

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెరిగితే వాహనాల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్, విడి భాగాలు త్వరగా చెడిపోతాయని, వాహనదారులకు నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌లో ఇథనాల్ ఎంత కలుపుతున్నారో తెలిపే లేబుళ్లను పెట్రోల్ బంకుల్లో అతికించాలని డిమాండ్ చేశారు. 

20 శాతానికి మించలేదు: చమురు కంపెనీలు

రాహుల్ గాంధీ, కర్ణాటక ప్రభుత్వం చేసిన ఆరోపణలను చమురు కంపెనీలు ఓ సంయుక్త ప్రకటనలో ఖండించాయి. పెట్రోల్‌లో ఇథనాల్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే కలుపుతున్నామని ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ స్పష్టం చేశాయి. కర్ణాటక ప్రభుత్వం పరీక్షలు చేసినప్పుడు తమ ప్రతినిధులను భాగస్వాములను చేయలేదన్నాయి. తాము దేశవ్యాప్తంగా 893 నమూనాలను పరీక్షించామని.. వీటిలో కర్ణాటకకు చెందిన 56 నమూనాలు కూడా ఉన్నాయని తెలిపాయి. కర్ణాటక నుంచి సేకరించిన నమూనాల్లో ఇథనాల్ 19.3 శాతమే ఉందని తెలిపాయి. తమ ప్రతినిధుల సమక్షంలో మరోసారి పరీక్షలు నిర్వహించాలని కోరాయి. 

మరిన్ని వార్తలు