ఆలయాన కాకతీయ కళ
తెలంగాణలో కాకతీయ శిల్పకళా(Kakatiya Sculpture) వైభవానికి నిలువుటద్దాలుగా నిలిచే ఆలయాల నిర్మాణం క్రీ.శ.1163లో వేయి స్తంభాల గుడితో(Thousand Pillar Temple) మొదలైంది. ఈ అద్భుతమైన ఆలయాల నిర్మాణాలు 14వ శతాబ్దపు తొలి దశకం వరకు నిరంతరాయంగా కొనసాగాయని శాసనాల ఆధారంగా తెలుస్తోంది. వైవిధ్యానికి, వినూత్న శైలికి మారుపేరుగా నిలిచే కాకతీయ ఆలయాలు(Kakatiya Temples) భారతీయ వాసు ్తశిల్ప రంగంలోనే(Field of Indian Architecture) ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించాయి.
ఏక కూటాలయం: ములుగు జిల్లా(Mulugu District) పాలంపేటలోని రుద్రేశ్వరాలయమే రామప్పగుడి. క్రీ.శ. 1213లో కాకతి గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రుడు ఈ గుడిని, మరికొన్ని దేవాలయాలను కట్టించినట్లు శాసనం పేర్కొంటుంది. ఇది ఏకకూటాలయం. గర్భగుడి, అంతరాళం, మూడు ద్వారాలున్న మంటపం దీని నిర్మాణ ప్రణాళిక.
61/2 అడుగుల ఉపపీఠం, 10 అడుగుల ప్రదక్షిణాపథం ఉన్నాయి. ప్రధాన మందిరం గోడల మీద కుడులు, కుడ్య స్తంభాలు అలంకరింపబడి ఉన్నాయి. ద్వారస్తంభాల మీద బయటకు చొచ్చుకునివచ్చిన కప్పు(చూరు)కు ఆధారంగా నిల్పిన ఊతపుత్తళికల(బ్రాకెట్ ఫిగర్స్)లో కొన్ని అలసకన్యలు. మదనికలు కావు. సాలభంజికలు లేవు. బరువులేని ఇటికలతో కట్టిన ఆలయగోపురం పిరమిడ్ నిర్మాణం. రాళ్లు కరిగించి, పోతపోసిన విగ్రహాలేవీ లేవు. ధ్వనించే శిల్పాలకు ప్రత్యేకమైన శిలలతో చేసినవి. మంటపంలోని స్తంభాలు, దూలాలపై పౌరాణిక కథా దశ్యాలు చెక్కబడి వున్నాయి. బయటి గోడపై పార్వతి తపస్సు ఘటాన్ని ప్రతిబింబింపజేసే ప్రత్యేక శిల్పం. ఆకట్టుకుంటుంది.
ద్వి కూటాలయం: సూర్యాపేట జిల్లాలోని కల్మలచెరువు ఊరిలో వేంకటేశ్వర దేవాలయం, శివాలయం ఉన్నాయి. వేంకటేశ్వర దేవాలయంలో వేంకటేశ్వరుని వలవిగ్రహం, వైష్ణవ ద్వారపాలకుల శిల్పాలు కొత్తగా ఉన్నాయి. దేవాలయ మంటపంలో స్తంభాలు శైలిలో వున్నాయి. ఇది ద్వికూట దేవాలయం, ప్రధాన దేవాలయంలో గర్భగుడి, అంతరాళాలు కొంచెం ఎత్తులో వున్నాయి. ఉపాలయం దిగువగా వుంది. ఉపాలయంలో లక్ష్మీదేవి ప్రతిష్ఠించబడివుంది. రెండు ఆలయాలు ఒకే కప్పుకింద వున్నాయి. ముఖమంటపం 16 స్తంభాలతో వుంది. దేవాలయ ద్వారం అర్ధ మంటపంతో వుంది. శివాలయం చిన్నదిగా, ఎత్తు తక్కువగా వుంది. గర్భాలయంలో చతురస్రాకారపు పానవట్టంపై అడుగు ఎత్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు.
త్రి కూటాలయం: కాకతీయ నిర్మాణాలలో వేయిస్తంభాల గుడిగా పేరుపొందిన హనుమకొండలోని త్రికూటం తొలిదశ దేవాలయం. కాకతీయ 1వ రుద్రదేవుడు రాజ్యాధీశుడైన తొలినాళ్లలో కట్టించిన రుద్రేశ్వరాలయం. ఈ గుడిలో రుద్రుడు, వాసుదేవుడు, సూర్యుడు దేవుళ్లు. త్రైపురుష దైవారాధనకు గుర్తు. రెండు భాగాలుగా వున్న ఈ నిర్మాణంలో గుడికెదురుగా వున్నది ఆస్థానమంటపం. వెయ్యిస్తంభాలన్న పేరే కానీ, అన్ని స్తంభాలు లేవు. రెండింటికీ విమానాలు లేవు.
ఈ ఆలయప్రణాళిక ప్రతిష్ఠింపబడిన దేవుళ్ల క్రమంలో ఉన్నది. మంటపానికి తూర్పు, ఉత్తరం, పడుమర ముఖాలుగా ఒకే విధమైన గర్భ గృహాలున్నాయి. ద్వారమంటపం దక్షిణదిశలో ఉంది. ముఖ మంటపంలోని స్తంభాలు, ద్వారాలు, శివలింగ పానవట్టం, నంది శిల్పాలు అద్భుతమైన అలంకారాలతో చెక్కబడి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆలయ పుష్పాల్లో చతుర్దల పుష్పాలు, ద్విపట్ట, త్రిపట్ట, కంఠి వంటి నిర్మాణాలు ప్రత్యేకతను చాటుతాయి.
శ్రీరామోజు హరగోపాల్,
కన్వీనర్, కొత్త తెలంగాణ
చరిత్రబృందం
99494 98698