డిండికి ఏదుల నుంచి నీళ్లు ఎలా తెస్తారు?
- ఎల్లూరు పంపుహౌస్ డిజైన్ మార్పుతో నష్టం
- పాలమూరు, నల్లగొండ ప్రజలను మోసం చేస్తున్న సీఎం
- గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే నీటి సమస్యకు పరిష్కారం
- టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
- డిండి రిజర్వాయర్ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నవంబర్ 7 (విజయక్రాంతి): డిండి రిజర్వాయర్‌కు(Dindi Reservoir) ఏదుల నుంచి నీళ్లు తెస్తామంటూ మహబూబ్‌నగర్, నల్లగొండ ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Rakshana Sena President Kavitha) ధ్వజమెత్తారు. డిండి రిజర్వాయర్‌కు నీళ్లు తేవాలంటే గోదావరి, కృష్ణా నదులను(Godavari and Krishna rivers) అనుసంధానం చేయటమే సరైన పరిష్కారమని చెప్పారు. దానికి సంబంధించిన సాంకేతిక వివరాలను వివరిస్తూ డిండి రిజర్వాయర్ వద్దే శనివారం ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకే 2 టీఎంసీల నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఉంటే డిండికి నీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. పైగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే లెవల్ 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెరిగిందని గుర్తు చేశారు. ఎల్లూరు పంపుహౌస్ ను ఓపెన్ కట్ నుంచి అండర్ గ్రౌండ్ గా మార్చడంతోనే సమస్య వచ్చిందని చెప్పారు. అప్రోచ్ చానల్ 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గిపోయిందని.. ఎల్లూరు పంపుహౌస్ కోసం చేపట్టిన బ్లాస్టింగ్స్‌తో కల్వకుర్తి పంపు హౌస్ లో ఒక పంపు పేలిపోయిందన్నారు.
ఏళ్లు గడిచినా దాన్ని రీస్టోర్ చేయకపోగా..ఇప్పుడు మళ్లీ 0.6 టీఎంసీల కోసం ఇంకో సోర్స్ కోసం పంపు హౌస్ తవ్వితే కల్వకుర్తి, పాలమూరు పంపు హౌస్ లకు ప్రమాదం తప్పదని హెచ్చరించారు. అన్ని అడ్డంకుల మధ్య ఏదుల నుంచి డిండికి లింక్ చేస్తామని చెప్పటం రెండు జిల్లాల ప్రజల మధ్య తగువులు పెట్టించటమేనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏదులను డిండికి సోర్స్ పాయింట్ అని చెబుతున్నప్పటికీ దానికి ప్రతిపాదిక ఏమిటని కవిత ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ నీటి సమస్యలకు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని కవిత చెప్పారు.
కాళేశ్వరం అడిషనల్ టీఎంసీతో బస్వాపూర్ మీదుగా డిండి ఎత్తిపోతలకు నీళ్లు ఇవ్వడమే శాశ్వత పరిష్కారమన్నారు. శివన్న గూడెం, కిష్టరాయి పల్లి పూర్తి కాకపోయినప్పటికీ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చన్నారు. ఉల్పరకు కూడా బస్వాపూర్ నుంచి నీళ్లు తీసుకోవచ్చని చెప్పారు. కొండపోచంపల్లి నుంచి షామిర్ పేట్ చెరువు ద్వారా కూడా శివన్నగూడెంకు గోదావరి నీళ్లను తీసుకురావచ్చని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీటిని పుష్కలంగా వాడుకోవాలంటే ఆ రెండు నదులను అనుసంధానం చేయాల్సిందేనని కవిత అన్నారు.
గోదావరి, కావేరి నదుల అనుసంధానాన్ని తుపాకుల గూడెం వద్దే జరిగేలా చూడాలని, ఆంధ్రా ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి పోలవరం వద్ద చేస్తామంటే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు నెలల క్రితం మళ్లీ ఫ్లోరైడ్ కేసు నమోదవటం ఆందోళనకు గురిచేసిందని కవిత చెప్పారు. ఫ్లోరైడ్ సమస్య పోవాలంటే 40 ఏళ్ల వరకు ఈ నేల నది జలాలతో తడవాల్సిన అవసరముందన్నారు. జూరాల నుంచి శ్రీశైలం వరకు 2 వందల కిలోమీటర్ల దూరం వరకు మనం ఒక్క ప్రాజెక్ట్ కట్టుకోకపోవటం అన్యాయమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా నల్లగొండ జిల్లాలో చిన్న చిన్న రిజర్వాయర్లు కడతామని చెప్పారు.
మహిళా రైతులకు అండగా కవిత
డిండి ప్రాజెక్టు పరిశీలన కోసం వెళ్తుండగా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదిక వద్ద పెద్ద ఎత్తున మహిళా రైతులు ఉండటం చూసి కల్లకుంట్ల ఆరా తీశారు. వేరు శనగ విత్తనాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మహిళా రైతులు వాపోయారు. వెంటనే నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన కలెక్టర్ మహిళా రైతులకు వెంటనే వేరు శనగ విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో విత్తనాల సంచులను అందజేశారు.