ఇరాన్ అణు రహస్యాలు చెప్పండి

08-11-2026 | 05:20am
  1. రూ.170 కోట్ల నజరానా పొందండి
  2. రక్షణ కూడా కల్పిస్తాం
  3. ఇరాన్ శాస్త్రవేత్తలకు అమెరికా వల

న్యూయార్క్, నవంబర్ 7: ఇరాన్ శాస్త్రవేత్తలకు(Iranian scientists) అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇరాన్ అణు కార్యక్రమానికి(Iran's nuclear program) సంబంధించిన కీలక రహస్యాలు వెల్లడిస్తే 20 మిలియన్ డాలర్ల (సుమారు రూ.170 కోట్లు) భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ఇరాన్ అణు కేంద్రాలు, రహస్య స్థావరాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం(Technology), పరికరాలు ఉపయోగిస్తున్నారు? అణుకార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, కీలక సిబ్బంది ఎవరు? యురేనియం శుద్ధి, అణు ఇంధన తయారీకి సంబంధించిన కార్యకలాపాలేంటి? సెంట్రిఫ్యూజ్‌ల తయారీ(Manufacturing of centrifuges), నిల్వ, సరఫరా వివరాలేంటి? తదితర వివరాలు తెలిపిన వారికి బంపర్ ఆఫర్ ఇవ్వడమే కాదు..

అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ పథకం కింద ఈ ప్రకటన చేసింది. అయితే.. ఏ స్థాయి సమాచారానికి ఎంత మొత్తం చెల్లిస్తారు? పూర్తి బహుమతి పొందాలంటే ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. 

ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశాం: ట్రంప్

1984లో ప్రారంభమైన ’రివార్డ్స్ ఫర్ జస్టిస్’ ద్వారా అమెరికా భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించిన వారికి గతంలోనూ రివార్డులు ఇచ్చారు. అదే సందర్భంలో తమ సైనిక చర్యల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీశామని, ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశాన్ని అడ్డుకున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. అమెరికా జోక్యం చేసుకోకుంటే ఇజ్రాయెల్ మనుగడే ప్రమాదంలో పడేదన్నారు. 8 నెలల యుద్ధంలో ఇరాన్ సైనిక, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీశామని చెప్పుకున్నారు.

అయితే.. మధ్య ఇరాన్‌లోని ‘పీక్‌యాక్స్ మౌంటైన్’ ప్రాంతంలో ఇప్పటికీ అణు సంబంధిత కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానం అమెరికాకు ఉంది. మరోవైపు.. అమెరికాతో చర్చలకు టెహ్రాన్ ఆసక్తిగా ఉందని ట్రంప్ చెబుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు కూడా చర్చల మార్గానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా చర్చల ద్వారా ముగిద్దామనుకుంటుందా..? ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్యలకు సిద్ధమవుతోందా..? అనే విషయం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. 

మరిన్ని వార్తలు