ఉచ్చు బిగుస్తోంది

14-10-2026 | 05:35am
  1. ప్రజల నుంచి మోదీ, షా తప్పించుకోలేరు
  2. అంతిమ లక్ష్యం చేరేవరకు పోరు ఆగదు 
  3. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ దిగిపోవాల్సిందే..
  4. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్  హెచ్చరిక 
  5. రాహుల్ ఇంట్లో ఇండీ కూటమి నేతల భేటీ 
  6. భవిష్యత్ కార్యాచరణపై చర్చ 
  7. పాల్గొన్న ఖర్గే, సోనియా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని, ప్రజల నుంచి వారు తప్పించుకోలేరని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హెచ్చరించారు. ఓట్ల చోరీతో దేశాన్ని హైజాక్ చేయాలని చూసినవారికి శిక్ష తప్పదన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్(CEC Gyanesh Kumar) రాజీ నామా చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ‘మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్,  డెహ్రాడూన్‌లో దాక్కున్న ఆ మహిళను న్యాయస్థానం ముందు నిలబెడుతాం. వారికి శిక్షపడేవరకు మేం వెనక్కి తగ్గబోం’ అని ఆయన ప్రకటించారు.

ఎన్నికల అవకతవకలపై తమ పోరాటం ఆగదని, అంతిమ లక్ష్యం చేరేవరకు ఇండీ కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తుదిశ్వాస వరకూ పోరాడుతామని ఆయన అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంట్లో ఇండీ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా వారంరోజుల నుంచి చేపడుతున్న ఆందోళనలపై సమీక్షించారు. భవిష్యత్ కార్యాచ రణపై చర్చించారు.

ఇందులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతోపాటు ఆర్జేడీ, ఎన్సీపీ(శరద్ పవార్), ఎస్పీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. అనంతరం నేతలంతా బయటకువచ్చి సం యుక్త మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారం సుప్రీంకోర్టు వరకు తాము చేపట్టిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. బీజేపీ చేతుల్లో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని, దాన్ని పునరుద్ధరించడమే తమ బాధ్యత అని చెప్పారు. 

అసలు సూత్రధారి మోదీ

ఓట్ల చోరీలో ప్రధాని నరేంద్ర మోదీ అస లు సూత్రధారి అని రాహుల్ గాంధీ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అడ్డుపెట్టుకొని ఓట్ల చోరీకి, ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాస్తవా లు కండ్ల ముందు కనిపిస్తున్నా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ‘మన దేశంలో ప్రజాస్వామ్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగా లు చేశారు. అలాంటి ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది. అలాం టి వాళ్లను వదిలిపెట్టబోం’ అని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్‌పై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. 

దేశమంతా మాతోనే

మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్ ఒకవైపు ఉంటే.. దేశమంతా మరోవైపు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ, షా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని, దాని నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. దేశమంతా తమతోనే ఉందని, వారం రోజుల పాటు చేపట్టిన ఆందోళనకు వచ్చిన ప్రజా స్పందనే అందుకు నిదర్శనమని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలపకుండా డీనోటిఫై చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ప్రజల గొంతును నొక్కడమేనని మండిపడ్డారు. ఇండీ కూటమి చేస్తున్న పోరాటం తమ కోసం కాదని, దేశ భవిష్యత్తు కోసమని చెప్పారు.

‘రేపా, ఎల్లుండా, నెలనా, రెండు నెలలా, ఏడాదా, రెండేండ్లా.. అన్నది ఇక్కడ ముఖ్యం కాదు.   ఎన్నిరోజులైనా సరే అంతిమ లక్ష్యం చేరే వరకు మా పోరాటం ఆగదు. లక్ష్యాన్ని ఎలా చేరుకుంటామన్నది ఇప్పుడే చెప్పలేను. అలా చెబితే ఉత్కంఠ ఏముంటుంది?  త్వరలోనే అన్ని చూస్తారు. ఇప్పటివరకు ఎలా ఐక్యంగా ముందుకు సాగామో, ఇకపైనా అదే తీరులో కలిసికట్టుగా ఇండీ కూటమి ముందుకు సాగుతుంది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

ఆ మహిళ కూడా..!

న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఎన్నికల అక్రమాలను తేల్చేందుకు న్యాయవ్యవస్థ తన పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఓట్ల చోరీ ఘటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, ప్రస్తుతం  డెహ్రాడూన్‌లో దాక్కున్న ఆ మహిళతోపాటు ఇంకెవరున్నా న్యాయస్థానం ముందు నిలబెడుతాం. ఎవరినీ వదిలిపెట్టబోం’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాగా, సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీలు సాగరికా ఘోష్, మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, సమాజ్ వాదీ పార్టీ నేతలు హరేందర్ మాలిక్, ఆనంద్ బదూరియా, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత ఎంఏ బేబీ తదితరులు పాల్గొన్నారు. 

మోదీకి ప్రజలే గుణపాఠం చెప్తరు: ఖర్గే

ప్రధాని మోదీ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ఆయనకు ప్రజలే గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా గత వారం రోజుల నుంచి  జరుగుతున్న ఆందోళనల్లో ప్రజలు, ముఖ్యంగా యువతీయువకులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు ఓట్ల చోరీని బయటపెడితే.. ఇప్పుడు జనమే ఆ గుట్టును రట్టు చేస్తున్నారని తెలిపారు.  

ప్రమాదంలో రాజ్యాంగం: సుప్రియ

మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇండీ కూటమి ఐక్యంగా ముందుకు వెళ్తున్నదని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాయడానికి ప్రయత్నిస్తున్నదని, ఆ హక్కుల కోసం ఎంతవరకైనా ఉద్యమిస్తామని ఆమె చెప్పారు. 

ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: తేజస్వీ

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఓట్ల చోరీ వెనుక మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్ ఉన్నారని.. వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాజ్యాంగ బద్ధ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇలా అన్నింటినీ మోదీ సర్కార్ హైజాక్ చేసిందని ఆయన ఆరోపించారు. ఏఐఎస్‌ఏ ప్రెసిడెంట్ నేహా బోరా మాట్లాడుతూ.. దేశానికి ఉన్న ఏకైక శత్రువు బీజేపీ అని, అన్ని వ్యవస్థలను అది ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు.

ఎవరా మహిళ? 

ఇండీ కూటమి నేతలతో సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియా తో మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్, డెహ్రాడూన్‌లో దాక్కున్న ఆ మహిళను కూడా న్యాయస్థానం ముందు నిలబెడుతామనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ మహిళ పేరును రాహుల్ ప్రస్తావించకపోవడంతో ఆమె ఎవరన్నది చర్చనీయాంశమైంది. సోమవారం సుప్రీంకోర్టు వరకు రాహుల్‌తోపాటు ఇండీ కూటమి నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆ న్యూస్ కవరేజీకి వచ్చిన తనను రాహుల్ గాంధీ బలవంతంగా నెట్టివేశారని, తాను మూడు నెలల గర్భిణిని అని జర్నలిస్టు రిచా పరాశర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే.. రాహుల్ తాజాగా ‘ఆ మహిళ’ అంటూ ప్రస్తావించింది రిచా గురించే అయి ఉండొచ్చన్న చర్చ సాగుతున్నది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నా గురించి మాట్లాడి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తున్నది. సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించి ఓటర్ల జాబితాను       ఈసీ తారుమారుచేస్తున్నదని, దీని  వెనుక సీమా ఖన్నా హస్తం ఉందంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు.

మరిన్ని వార్తలు