అవినీతికి కేరాఫ్ ‘మెట్’ తహసీల్దార్ ఆఫీస్..
- లంచం ఇస్తేనే ఫైళ్లలో కదలిక
- రూ.20 లక్షల లంచం కేసుతో మళ్లీ వార్తల్లోకి..
- విజయారెడ్డి సజీవదహనం ఘటన
- అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
- మారని అధికారుల తీరు
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం(Abdullapurmet Tahsildar Office) అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రెవెన్యూ అధికారుల(Revenue officials') వేధింపులతో ప్రజలుఅల్లాడిపోతున్నారు. భూ సమస్యల పరిష్కారం, భూముల సర్వేలు(Land Surveys), సాధారణ రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వచ్చే బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘చేతివాటం’ తడిపితే తప్ప ఫైలు కదలని పరిస్థితి ఇక్కడ నెలకొంది. లంచాలు ఇచ్చుకున్నా పనులు కాకపోవడంతో విసిగిపోయిన బాధితులు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు.
ఏసీబీ ట్రాప్‌తో మళ్లీ చర్చనీయాంశంగా..
అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో భూ వివాదాలు పెరిగాయి. వీటిని ఆసరాగా చేసుకుని రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున ముడుపులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవలే పసుమాముల గ్రామం సర్వే నంబర్ 137/2కు సంబంధించిన సర్వే నివేదిక జారీ చేసేందుకు ఏకంగా రూ. 50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ. 30 లక్షలకు బేరం కుదిరి, అందులో రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కాడు. ఒకరి పేరున ఉన్న భూమిని మరొకరి పేరు మీదకు మార్చడం, నాలా పర్మిషన్లు ఇవ్వడం వంటి అక్రమాలకు తెగబడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం..
అవినీతి అక్రమాలతో భూ సమస్యలు పరిష్కారం కాక బాధితులు ఎంతటి తీవ్ర నిర్ణయాలకైనా పూనుకుంటారనడానికి గతంలో జరిగిన ఘటనే నిదర్శనం. గౌరెల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు బాచారం సర్వే నంబర్ 9195లో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి పాస్బుక్కుల కోసం అప్పటి తహసీల్దార్ విజయారెడ్డి రూ. 30 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులు ఇచ్చినా పాస్‌బుక్కులు ఇవ్వకుండా ఆఫీసు చుట్టూ తిప్పించుకోవడంతో విసిగిపోయిన ఆ రైతు 2019లో తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.ఈ దారుణ ఘటనలో తహసీల్దార్‌తో పాటు ఆ రైతు కూడా మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా ఆ భూ సమస్య ఇప్పటికీ అలాగే ఉండటం రెవెన్యూ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. అంతటి ఘోరం జరిగినా అధికారుల వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం.
పైరవీకారుల సందడి..
ఒకప్పుడు సామాన్య ప్రజలతో సందడిగా ఉండాల్సిన తహసీల్దార్ కార్యాలయం ఇప్పు డు ఫైరవీకారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నిలయంగా మారింది. రెవెన్యూ అధికారుల బంధువులు, సన్నిహితులే మధ్యవర్తులుగా అవతారమెత్తి దందాలునడుపు తున్నారనే విమర్శలు ఉన్నాయి. సోమవారం ఏసీబీ దాడి నేపథ్యంలో మంగళ వారం అబ్దుల్లాపూర్‌మెట్ ఆఫీస్ బోసిబోయి కనిపించింది. లంచం కేసులో సర్వేయర్ పట్టుబడటంతో జనాలు ఆఫీసుకు రావడానికి భయపడుతున్నారు. అధికారులపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.