కౌన్ పూచ్ తా.. కొల్లాపూర్..!

14-10-2026 | 05:15am

మున్సిపాలిటీ అభివృద్ధికి రాజకీయ గ్రహణం

పన్నుల వసూళ్లలో వెనుకంజ..

సిబ్బంది జీతాలకే గతి లేని దుస్థితి

ఏడాది కాలంగా పీఎఫ్ బకాయిలు.. మూడు మాసాలుగా వేతనాల నిలిపివేత

నత్త నడకన నూతన భవన నిర్మాణ పనులు ఇరుకు గదుల్లోనే మున్సిపాలిటీ విధులు

రూ.80 లక్షల లోటు బడ్జెట్‌తో అభివృద్ధికి ఆమడ దూరం. 

నాగర్ కర్నూల్, అక్టోబర్ 13 (విజయక్రాంతి) / కొల్లాపూర్ రూరల్ : పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన మున్సిపాలిటీ ఆర్థిక సంక్షోభంలో(Municipality's financial crisis) కొట్టు మిట్టాడుతోంది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలందించాల్సిన పాలక యంత్రాంగం రాజకీయ షోకేజ్ లకే పరిమితమై కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరోవైపు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు లేక ట్యాంక్ బండ్, పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి.

ఇరుకైన రోడ్లు, ఆక్రమణలు, అక్రమ కట్టడాలు(Illegal constructions), పన్నుల వసూళ్లలో వెనుకబడి ఆదాయానికి మించిన ఖర్చులు, రాజకీయ జోక్యంపై ఆరోపణలు వెరసి కొల్లాపూర్ మున్సిపాలిటీని సమస్యల సుడిగుండంలోకి నెడుతున్న పరిస్థితి. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే చిన్నపాటి కార్మికుల జీతాలని నిలిపి అధికారులను, ప్రజాప్రతినిధులను ఆకాశానికి ఎత్తుకునే కాంట్రాక్టర్లకు మాత్రం పెండింగ్ బిల్లులను క్లియరెన్స్ చేసిన్నట్లు విమర్శలున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణంలోనే ఈ పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారుతోంది. 

జీతాలకే దిక్కులేని దుస్థితి.!

కొల్లాపూర్ మున్సిపాలిటీలో 71 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఏడుగురు డ్రైవర్లు, మరో 15 మంది కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెలా సుమారు రూ.15 లక్షల మేర వేతనాలివ్వాల్సి ఉంది. కానీ మూడు నెలలుగా జీతాలు అందక దసరా పండగ వేల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు ఏడాది కాలంగా ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లింపులు కూడా పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు. కానీ కాంట్రాక్టర్ల పాత బకాయిలకు క్లియరెన్స్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రూ.1.30 కోట్ల ఆదాయం.. రూ.80 లక్షల లోటు!

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6,300 గృహాలు, జనాభా 25 వేలకు పైగా ఉంది. ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఇతర పన్నుల రూపంలో ఏడాదికి సుమారు రూ.1.30 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే మున్సిపాలిటీ నిర్వహణ ఖర్చులు, ప్రతి నెల 15లక్షలు కార్మికులు, సిబ్బంది వేతనాలతో పాటు ఇతర అవసరాలకు ఈ ఆదాయం సరిపోవడం లేదని ఇంకా రూ.80 లక్షల లోటు బడ్జెట్ ఉంటున్నట్లు తెలుస్తోంది. 

పన్నుల వసూళ్లకు రాజకీయ గ్రహణం.!

మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పన్నుల వసూళ్లు సమర్థంగా జరగాలి. కానీ కొల్లాపూర్లో పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్, భవన నిర్మాణాల్లో సెట్బ్యాక్ నిబంధనల ఉల్లంఘనలు, ఆక్రమణలు, నామమాత్రపు పన్నుల చెల్లింపుల వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న రాజకీయ పార్టీల కార్యక్రమం జరిగినా వేల సంఖ్యలో బ్యానర్లు దర్శనమిస్తున్నాయి తప్ప మున్సిపాలిటీ ఆదాయానికి చిల్లి గవ్వ కూడా అందడం లేదని విమర్శలున్నాయి.

ఆయా విద్యా, వ్యాపార సంస్థలు తమ ప్రకటనలను ఆయా వాల్ పోస్టర్లు, పెయింటింగ్స్ ఇతర వేదికల ద్వారా ప్రచారం చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. పన్నులు వసూలు చేయడానికి ప్రయత్నించే సందర్భాల్లో ఉద్యోగులపై ఒత్తిళ్లు, మా వెనకెవరున్నారో తెలుసా అంటూ బెదిరింపులున్నాయన్న ప్రచారం కూడా ఉంది. 

పాలకవర్గం ఉన్నా.. ఫలితం సున్నా.!

గతేడాది ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు, బిఆర్‌ఎస్ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందగా అధికార పార్టీ పాలకవర్గం కొలువుదీరటంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని పట్టణ ప్రజలు ఆశించారు. రహదారులు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని భావించారు. కానీ నిధుల కొరత కారణంగా పాలకవర్గం ముందున్న ప్రతిపాదనలు పక్కన పెడితే గుక్కెడు మంచినీటికి కూడా నోచుకునే పరిస్థితి లేకుండా పోయిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నా, వాటిని అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోలేకపోతే ప్రయోజనం ఏమిటన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం పట్టణ అవసరాలపై నిర్ణయాలు తీసుకున్నా, నిధుల సమీకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి. 

ప్రతిపాదనలు కాగితాలకే.!

సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే కొల్లాపూర్ అత్యంత సుందరంగా మారుతుందని ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు నిధులు లేక నిరాశ ఎదురవుతుంది. కొల్లాపూర్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకు రావడంతోపాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మినీ ట్యాంక్బండ్, పార్కుల అభివృద్ధి వంటి ప్రతిపాదనలున్నాయి. కానీ నిధుల కొరత కారణంగా ఈ పనులు ముందుకు సాగడం లేదు. కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కూడా ఏజెన్సీలు ముందుకు రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. 

త్వరలోనే కార్మికుల జీతాలు చెల్లిస్తాం.

కార్మికుల జీతాలను చెల్లించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి నెల సుమారు 80 లక్షల నోటు బడ్జెట్ తో మున్సిపల్ కొనసాగుతోంది. నివేదికలను ప్రభుత్వానికి కూడా పంపాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్మికుల జీతాలను సరిచేస్తాం. 

శంకర్, మున్సిపల్ కమిషనర్, కొల్లాపూర్

మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో మంత్రి రూ.40 లక్షల ఇచ్చారు. 

కొల్లాపూర్ మున్సిపల్ అభివృద్ధి కొరకు పాలకవర్గం ఏర్పాటు కాకముందు మంత్రి జూపల్లి కృష్ణారావు 40 లక్షలు నిధులిచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి నిధులు ఇస్తామన్నారు. మున్సిపల్ అభివృద్ధి కోసం ఎలాంటి రాజకీయ వత్తిళ్లు లేకుండా పనిచేసేందుకు ముందుకెళ్తాం. పన్నుల చెల్లింపుల్లో ప్రజలు కూడా సహకరించాలి.

 రెడ్డి జ్యోతి, మున్సిపల్ చైర్ పర్సన్, కొల్లాపూర్

మరిన్ని వార్తలు