బీసీలకు రాజ్యాధికారం దక్కేవరకు పోరాటం

14-10-2026 | 05:05am
  1. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలతో బీసీలకు అన్యాయం
  2. బీసీ రాజ్యాధికార యాత్ర జడ్చర్లలో తీన్మార్ మల్లన్న

అక్టోబర్ 13 (విజయక్రాంతి): జడ్చర్లలో అనిరుధ్‌రెడ్డి(Anirudh Reddy) ఆఖరు ఎమ్మెల్యే అని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర బడుగు బలహీన వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ అధికారం దక్కాల్సిందేనని టీఆర్పీ (తెలంగాణ రాజ్యాధికార పార్టీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అన్నారు. దశాబ్దాలుగా బీసీ, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఐక్యతతోనే రాజకీయ మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ జడ్చర్లకు చేరుకున్న సందర్భంగా స్థానిక యువకులు, ఉద్యమ అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జడ్చర్ల ప్రధాన కూడలిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న మాట్లాడారు. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ నియామకాలు, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘంగా మాట్లాడారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బీసీ అంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అని, బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదని అన్నారు. అన్ని వర్గాల మధ్య ఐక్యత ఏర్పడితేనే రాజకీయ అధికారం సాధ్యమవుతుందన్నారు. తన యాత్ర నూటికి నూరుశాతం బడుగు బలహీన వర్గాల యాత్రేనని స్పష్టం చేశారు.

అగ్రవర్ణాలతో పోలిస్తే మనకు రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువన్నారు. అదే సమయంలో పేద రెడ్లకు కూడా ప్రాధాన్యత లభిస్తుందని, సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. తమ ఉద్యమం పేదలకు వ్యతిరేకం కాదన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై విమర్శలు సంధించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు పాలించిన వారు విశ్రాంతి తీసుకోవాలని, బీసీలు పరిపాలన చేపడతారని అన్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 10వేలు మాత్రమే ఉన్నాయని, ఇతరులవే ఎక్కువున్నాయన్నారు.

అయినా రాజకీయ అధికారం మాత్రం వారి చేతుల్లోనే కొనసాగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్, విద్యార్థుల సమస్యలు, సంక్షేమ హాస్టళ్ల నిధుల దారి మళ్లింపులపై ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తనపై అక్రమంగా 83 కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం ఇప్పటికీ ఎందుకు పూర్తికావడం లేదని ప్రశ్నించారు. బీసీ బడ్జెట్ నిధులపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎర్ర సత్యం పోరాట చరిత్రను గుర్తు చేశారు. కులవృత్తులకు చేసిన ఖర్చెంత అని ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయ అధికారమే తమ లక్ష్యమని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు