24 April, 2026 | 9:00 PM

భట్టి.. హరీశ్ మధ్యలో సీఎం!

20-12-2024 01:44 AM

రెండ్రోజుల తర్వాత మౌనం వీడిన ముఖ్యమంత్రి 

ఓఆర్‌ఆర్ కాంట్రాక్టుపై సిట్ దర్యాప్తునకు ఆదేశం...

బీఆర్‌ఎస్‌కు మరో శరాఘాతం

కేటీఆర్ మెడకు మరో వివాదం!

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): శాసనసభలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య చర్చ రసవత్తరంగా జరుగుతుండగా మధ్యలో సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకోవడంతో సీనంతా మారిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టును అప్పనంగా కట్టబెట్టి వేలకోట్లు దోచుకుతిన్నారంటూ భట్టి ఆరోపించగా అధికారంలో మీరే ఉన్నారు కదా.. కాంట్రాక్టును రద్దు చేయండని హరీశ్‌రావు తిప్పికొట్టే ధోరణితో మాట్లాడారు.

అప్పటివరకు మౌనంగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి (రెండు రోజులుగా ఆయన సభలో మౌనంగా ఉంటూ వస్తున్నారు) అకస్మాత్తుగా లేచి.. ఓఆర్‌ఆర్ కాంట్రాక్టుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. హరీశ్‌రావు కోరిక మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేయిస్తున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా సీనంతా మారిపోయింది.

కేటీఆర్‌ను రక్షించబోయి..

ఓఆర్‌ఆర్ కాంట్రాక్టుపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలను బీఆర్‌ఎస్ నేతలు గట్టిగానే తిప్పికొడుతూ వస్తున్నారు. గురువారం సాయంత్రం హరీశ్‌రావు ఇదే ప్రయత్నం చేయగా.. దీనిని అవకాశంగా భావించిన ముఖ్యమంత్రి స్పందిస్తూ ఊహకు అందనివిధంగా సిట్‌తో దర్యాప్తు చేపడతామని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

కేటీఆర్‌పై విమర్శలను తిప్పికొట్టే క్రమంలో హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలే చివరకు కొంప ముంచాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కేటీఆర్‌ను రక్షించడానికి వెళ్తే.. మరో కొత్త విచారణ తెరపైకి రావడంతో బీఆర్‌ఎస్ నేతలు కక్కామింగలేని స్థితిలో ఉన్నారు.

రెండు రోజులుగా మౌనం..

ముఖ్యమంత్రి రెండ్రోజులుగా శాసనసభకు వస్తున్నా.. మౌనంగానే ఉంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దుద్దిళ్ల, సీతక్క, కోమటిరెడ్డి, పొన్నమే బీఆర్‌ఎస్ నేతలకు సమాధానమిస్తుండగా సీఎం వింటూ వస్తున్నారు. అయితే గురువారం సాయంత్రం భట్టి, హరీశ్‌రావు మధ్య గత, ప్రస్తుత అప్పులు, అందులో జరిగిన అనినీతిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతుండగా మధ్యలో సీఎం జోక్యం చేసుకున్నారు.

ఓఆర్‌ఆర్ కాంట్రాక్టులో భారీగా అవినీతి జరిగిందంటూ.. డిప్యూటీ సీఎం ఆరోపించడంతో.. కాంట్రాక్ట్ రద్దు చేయండని హరీశ్‌రావు అనడంతో.. అప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన రేవంత్‌రెడ్డి ఒక్కసారిగా లేచి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించడంతో అందరూ అవాక్కయ్యారు.

మౌనం వెనుక మతలబేంటి? 

ముఖ్యమంత్రి రెండు రోజులుగా మౌనంగా ఎందుకున్నారు? అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? పైగా అప్పుడే ఫార్ములా ఈ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి ఏ కేటీఆర్ పేరు చేర్చినట్టుగా అప్పుడే మీడియాకు సమాచారం అందింది. ఇదే సందర్భంగా ఓఆర్‌ఆర్ కాంట్రాక్టుపై సిట్‌తో దర్యాప్తునకు ఆదేశించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందేమోనన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. మొత్తానికి భట్టి, హరీశ్‌రావు మధ్యలో సీఎం జోక్యం చేసుకుని సిట్ దర్యాప్తునకు ఆదేశించడంతో కేటీఆర్ మెడకు మరో కేసు చుట్టుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.