పదేళ్లలో మా అప్పు 4.17 లక్షల కోట్లే
60 వేల కోట్లకు పైగా వారసత్వంగా వచ్చిందే
ఏడాదిలోనే మీరు చేసిన అప్పు 1.27 లక్షల కోట్లు
ఐదేళ్లలో రూ.7 లక్షల కోట్లు చేసేలా ఉన్నరు
ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్న రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ ఇమేజ్ పెంచడమే కేటీఆర్ తప్పా?
అధికారం మీదే కదా.. తప్పుంటే ఓఆర్‌ఆర్ టెండర్లు రద్దు చేయాలి
అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.4.17 లక్షల కోట్లేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉమ్మడి ఏపీ నుంచి రూ.60 వేల కోట్లకు పైగా అప్పు వారసత్వంగా వచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు చేసిన రూ. 15,118 కోట్లతోపాటు వారసత్వంగా వచ్చిన అప్పు కూడా బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అప్పుగా చూపడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్యారెంటీల రూపంలో చెల్లించాల్సినవి రూ.11,609 కోట్లని తెలిపారు.
వారసత్వ అప్పు, గ్యారెంటీల రూపంలో చెల్లించాల్సినవి, కాంగ్రెస్ చేసి బీఆర్‌ఎస్ ఖాతాలో వేసిన అన్ని కలిపి రూ.99,385 కోట్లని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న రాష్ట్ర రుణ భారం రూ. 6,71,757 కోట్లలో తమకు సంబంధం లేని అప్పులే దాదాపు లక్ష కోట్లు ఉన్నాయని స్పష్టంచేశారు. వీటితోపాటు ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని రూ.1.54 లక్షల కోట్ల అప్పులను తీసేస్తే బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో చేసింది కేవలం రూ.4.17 లక్షల కోట్లేనని వివరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఈ లెక్కన ఐదేళ్లలోనే రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసేలా కన్పిస్తుందని కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డారు.
తాము అప్పులతో సంపద సృష్టించి పేదలకు పంచామని ఉద్ఘాటించారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర ఇమేజ్ ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని కేటీఆర్ ప్రయత్నిస్తే కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టు మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని ధన యజ్ఞమని, అష్ట వంకర్ల ఓఆర్‌ఆర్ అని విమర్శించి.. ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. ఓఆర్‌ఆర్ టెండర్లను అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారని, మీకు అభ్యంతరం ఉంటే టెండర్లను వెంటనే రద్దు చేయాలని సవాల్ విసిరారు.






