24 April, 2026 | 7:21 PM

ఈ-రేస్‌తో ప్రభుత్వానికి 55౦ కోట్ల ఆదాయం

20-12-2024 01:41 AM
  1. చెల్లించింది 55 కోట్లు మాత్రమే
  2. నన్ను అరెస్టు చేసేందుకు అధికారపక్ష నేతల కుట్ర
  3. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు
  4. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
  5. కేటీఆర్‌పై కేసు ప్రభుత్వ కుట్రే : హరీశ్

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులకు రూ.55 కోట్లు చెల్లించింది వాస్తవమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. ఈ-రేస్ నిర్వ హణతో ప్రభుత్వానికి రూ.550 కోట్ల ఆదాయం రావడంతోపాటు అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని చెప్పారు.

ఈ-రేసుతో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరిగిందో నేటి పాలకులు గుర్తించి ప్రజలకు వివరిస్తే బాగుడేందని అన్నారు. రేవంత్ సర్కార్ తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడే ప్రసక్తేలేదని, తనపై కేసులతో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుందని పేర్కొన్నారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, సభలో ఫార్ములా ఈ చర్చించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల్లో ఎండగడుతామని హెచ్చరించారు. లైసెన్స్ ఫీజు రూ.74 లక్షలు వాపస్ పంపుతూ ఎఫ్‌ఎంఎస్‌ఏ వాళ్లు లేఖ రాశారని, ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు హయాంలో జీనోమ్ వ్యాలీ స్థాపించారని.. ప్రస్తుతం వ్యాక్సిన్ల ఉత్పత్తికి హైదరాబాద్ హబ్‌గా మారిందని అన్నారు. ఈవిధంగా ముందుచూపుతో ప్రభుత్వాలు పనులు చేస్తాయని, తాము కూడా కేసీఆర్ నాయకత్వంలో ఆటో మొబైల్, రెన్యువలబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా దేశానికి ఉండాలనుకున్నామని స్పష్టంచేశారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈకో సిస్టం డెవలప్ చేయాలని ప్రయత్నించామని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడానికి ఫార్ములా ఈ-రేస్ నిర్వాహకులు సుముఖత వ్యక్తంచేశారు.  

తంటాలు పడి ఒప్పించాం

2022 అక్టోబర్ 25 న నాలుగు సీజన్ల ఈ-రేస్ కోసం సంతకాలు చేశామని, రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలని, ఇన్నోవేషన్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్‌కు హబ్ కావాలని చేసినట్టు కేటీఆర్ స్పష్టంచేశారు. ఫార్ములా ఈ వాళ్లను సంప్రదిస్తే ఇండియాలో వీలుకాదని చెప్పారని.. తాము తంటాలు పడి ఒప్పించామని గుర్తుచేశారు.

ఇది హైదరాబాద్ ఈవెంట్ కాదని.. ఇండియా ఈవెంట్ అని పేర్కొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫార్ములా ఈ వాళ్లతో పాటు గ్రీన్ కో అనే ప్రమోటర్ కంపెనీతో కలిపి భాగస్వాములను చేసి అగ్రిమెంట్ చేసుకున్నట్టు వివరించారు. 2023 ఫిబ్రవరి ౧౦న రేసింగ్ నిర్వహించామని, వారంపాటు మొబిలిటీ వీక్ అమలు చేశామని తెలిపారు.

హ్యుందయ్, అమర రాజా వంటి ఎలక్ట్రిక్ కంపెనీలు పెట్టుబడులతో వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ రేస్ నిర్వహణపై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా గర్వంగా ట్వీట్ చేశారని, రేస్ అద్భుతమని అనురాగ్ ఠాకూర్, కిషన్‌రెడ్డితో పాటు సచిన్ టెండూల్కర్ ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖులు హాజరైనట్టు గుర్తుచేశారు.

ప్రపంచంలోని పాపులర్ డ్రైవర్స్ ఇక్కడికి వచ్చారని, రాజకీయ దిగ్గజాలు కూడా ఫార్ములా ఈ రేసింగ్‌కు తిలకించినట్టు వెల్లడించారు. రేస్‌ను ప్రమోట్ చేసేందుకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద కార్యక్రమం నిర్వహించామని, బాంబేలో పెట్టాలని మహారాష్ర్ట సీఎం కూడా వాదించారని, దాని తర్వాత ఢిల్లీలో క్రికెటర్లు, ఎంపీలతో కలిసి ఈవెంట్ ప్రమోషన్ నిర్వహించినట్టు వెల్లడించారు.

ఈ రేస్‌తో హైదరాబాద్‌కు ఎంతో ఆదాయం వచ్చిందని, ఈవెంట్‌కు హెఎండీఏ రూ.35 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ ప్రమోటర్ గ్రీన్ కో కంపెనీ రూ.110 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. 

82 మిలియన్ డాలర్ల ఎకనమిక్ బెన్‌ఫిట్

రేస్ విజయవంతంగా నిర్వహించిన తరువాత నెల్సన్ అనే సంస్థ అధ్యయనం చేసి రిపోర్టు ఇచ్చి హైదరాబాద్‌కు ఈ రేస్‌తో 82 మిలియన్ డాలర్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చిందని వెల్లడించినట్టు కేటీఆర్ తెలిపారు. ఖర్చు 150 కోట్లు మాత్రమేనని.. రూ. 550 కోట్ల మేర అదనంగా ఎకనమిక్ బెనిఫిట్ జరిగిందని స్పష్టంచేశారు. ప్రమోటర్‌గా వ్యవహరించిన గ్రీన్‌కో కంపెనీ వాళ్లు తమకు పైసలు రాలేదని చెప్పినట్టు గుర్తుచేశారు.

దీంతో ఆ సంస్థ వెనక్కి వెళ్తున్నామని వచ్చే ఏడాది చేయలేమని చెప్పిందన్నారు. 2023లో ఎన్నికలు, పలు రకాల కారణాలతో జూన్ నాటికి సెక్రటరి అర్వింద్‌కుమార్ వచ్చి నాలుగేళ్ల అగ్రిమెంట్ ఉందని అడిగారని, ఈవీలకు తెలంగాణ హబ్ కావాలంటే ఎలన్ మస్క్ లాంటి వ్యక్తిని పట్టుకొచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనేది తమ ప్రయత్నమని పేర్కొన్నారు.

2023 ఆగస్టు 3న ఫార్ములా ఈ నుంచి మెయిల్ వచ్చిందని, హెచ్‌ఎండీఏ నుంచి రూ.55 కోట్లు చెల్లిద్దామని చెప్పానని.. రేస్ కచ్చితంగా నిర్వహించాలని ప్రమోటర్‌ను వెతుకుదామని చెప్పినట్టు గుర్తుచేశారు. అర్వింద్‌కుమార్ రెండు దఫాలుగా 2023 అక్టోబర్ 5, 11న డబ్బులు పంపించారని స్పష్టంచేశారు.

అక్టోబర్ 19న హైదరాబాద్‌ను క్యాలెండర్‌లో చేర్చుతూ ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు నిర్ధారించారని చెప్పారు. ఆ డబ్బులు కట్టడంతో రేస్ నిర్వహించారని, డబ్బులు చెల్లించకపోతే రేస్ జరిగేదికాదని, రాష్ట్రం అభాసుపాలయ్యేదని అన్నారు. 

బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొలేక అక్రమ అరెస్టులు : కవిత

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాం తులకు గురిచేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వమని ఎద్దేవాచేశారు.

తామంతా కేసీఆర్ సైనికులమని.. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టామని స్పష్టంచేశారు. సీఎం రేవంత్ చిల్లర వ్యూహాలు తమను భయపెట్టబోవని, తమ సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయని చెప్పారు. 

ప్రజల పక్షాన నిలిచినందుకే కేసులు : దేవీప్రసాద్ 

ఆరు గ్యారంటీలు అమలు చేయలేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి డైవర్షన్ రాజకీయాలకు రేవంత్ ప్రభుత్వం తెర లేపిందని బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాదర్ ఆరోపించా రు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాల పట్ల ఎదురవుతున్న ప్రజాఆగ్రహానికి భయపడి కాంగ్రెస్, కేటీఆర్, హరీశ్‌రా వులాంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్‌రెడ్డి.. ఉద్యమ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్ని నిర్బంధాలు పెట్టినా, కేసులు నమోదు చేసినా, అరెస్ట్ చేసినా కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టంచేశారు.  

కేటీఆర్‌పై కేసు ప్రభుత్వ కుట్రే: మాజీ మంత్రి హరీశ్‌రావు

ఫార్ములా ఈ-రేసులో అక్రమంగా కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం ప్రభుత్వం కుట్రేనని, ఇలాంటి కేసులు తమకు కొత్తమేకాదని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చూశామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రేవంత్ బెదిరింపులకు వెనకడుగువేసే ప్రసక్తేలేదని, ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజాసమస్యలపై పోరు చేస్తామని హెచ్చరించారు. సభలో ఫార్ములా అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు వణికిపోయారని, దైర్యంగా ఎందుకు చర్చ జరపలేదని నిలదీశారు.