28-10-2025 12:00:00 AM
సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీ ఇందు కళాశాల ముందు ధర్నా
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 27: శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాల బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశత్తు క్రిందపడిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ చింతపట్ల ఎల్లేశ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిధి చేరిగూడ లోని శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాల ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఒరిస్సా రాష్ట్రనికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు దివాకర్ బత్ర బిల్డింగ్ పై నుంచి క్రిందపడి మృతిచెందగా, మృతిదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం అక్రమంగా ఒరిస్సా రాష్ట్రానికి తరలించే ప్రయత్నం చేసిందన్నారు. మృతుడు కుటుంబానికి రూ. 20లక్షలు రూపాయలు నష్టపరిహారంగా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కాలేజీ యాజమాన్యం సాగర్ హైవే పై ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా గేట్ నిర్మాణం చేసిందన్నారు.
వెంటనే నిర్మాణం చేసిన గేట్ ను తొలగించి 200ఫీట్ రోడ్డు కు సెట్ బ్యాక్ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా ఫిరంగి కాల్వ కు అనుకోని బఫర్ జోన్ వదలకుండా అక్రమంగా కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం కూడా తొలగించాలన్నారు. బిల్డింగ్ మీదనుంచి క్రిందపడి మృతిచెందిన కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పోలీసులు సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.