28-10-2025 12:00:00 AM
చొప్పదండి, అక్టోబర్27(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో యాకూబ్ పాషా అనే అటెండర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీరియస్ అయ్యారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏడాది కాలంగా విద్యార్థునులపై వేధింపులు జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ గౌస్ ఆలం తో ఫోన్లో మాట్లాడి ఆకృత్యానికి పాల్పడిన అటెండర్ యాకూబ్ పాషా ను విధుల నుండి తొలగించాలని కోరారు. సంఘటనతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత విద్యార్థులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.