calender_icon.png 22 February, 2026 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంధ పాఠశాల విద్యార్థులకు విజ్ డమ్ హైస్కూల్ విద్యార్థుల విరాళం

22-02-2026 03:28:01 PM

హనుమకొండ,(విజయ క్రాంతి): సోచ్ ఫౌండేషన్ వారి ఇట్రాడో  అంధుల పాఠశాలకు  విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు 1లక్ష 13 వేల రూపాయల విరాళాన్ని అందజేసినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోచ్ ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ... తాము కళ్ళు లేని వారిని ఆదరిస్తూ తమ పాఠశాలలో వారికి బ్రెయిలీలిపితో పాటు, క్రీడలు, సంగీతం, నాట్య కళల్లో  శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించడం గర్హనీయం అన్నారు.

సమాజంలో పుట్టు గుడ్డి వారు నిరాదరణకు గురవడం చూస్తున్నామని, వారిని మేము అక్కున చేర్చుకుని వారిలోని నైపుణ్యతను గుర్తించి వారికి తర్ఫీదును ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేవుడిచ్చిన అందమైన కళ్ళు గలవారు ముఖ్యంగా విద్యార్థులు చూపును కోల్పోవడం బాధ కలిగిస్తుందని వారు ఆవేదనను వెలుబుచ్చారు. దీనికి కారణం తల్లిదండ్రులు తమ ఐదుసంవత్సరాల లోపు చిన్నారులకు భోజనం చేస్తున్న సమయంలో ఏడవకుండా మొబైల్ ఫోన్లను అత్యధికంగా ఇవ్వడమే ప్రధాన కారణంగా అన్నారు. తర్వాత 6 నుండి 15 సంవత్సరాలలోపు విద్యార్థులు ఆటపాటల్లో కాకుండా ఫోన్లతో కాలక్షేపం చేయడం, వాటిలో గేమ్స్, తదితర విషయాలను అధికంగా చూడడం ప్రధాన కారణంగా తెలియజేశారు.

ఫోన్లను, టీవీలను పిల్లలు అధికంగా చూడడం వలన కంటిలోని రెటీనా క్షీణించి, కంటి నరాలు పాడయిపోయి  శాశ్వతంగా చూపు కోల్పోతుందని తెలిపారు. బంగారు భవిష్యత్తు గల ఇలాంటి పిల్లలు తమ అంధ  పాఠశాలలో చేరడం బాధ కలిగిస్తుందని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఇలాంటి విషయాలు పిల్లలకు తెలియజేయాల్సిన తల్లిదండ్రులు సైతం మొబైల్ ఫోన్లతో గడపడం బాధాకరమని అన్నారు. మొబైల్ ఫోన్లను అత్యధికంగా వాడడం వల్ల రేడియేషన్ తో మెదడులోని నరాలు క్షీణించి, మెదడు మొద్దు బారిపోయి అనేకమంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారని వారు తెలియజేశారు.

తమ పాఠశాలకు విజ్ డమ్ విద్యార్థులు 1 లక్ష 13 వేల రూపాయలు విరాళాన్ని సేకరించి అందించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాఠశాల విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు,  సేవా గుణంలో సైతం ముందు ఉండడం గర్హనీయమన్నారు. ప్రతీ సంవత్సరం మా అంధ పాఠశాలకు విరాళాలు అందిస్తూ మీలాంటి వారికి మేమున్నామనే భరోసాను కల్పించడం  ఆనందంగా ఉందని, ఆ భగవంతుడు పిల్లలకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,

బంగారు భవిష్యత్తునిస్తున్న  ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి  ఎల్లవేళలా ఆయురారోగ్యాలు కల్పించాలని ఇట్రాడో పాఠశాల విద్యార్థులు మనస్పూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్,  ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్  ఫహీం సుల్తాన, వీరభద్రయ్య, హారిక, ప్రశాంత్ కుమార్, రియాజ్, రాజేష్, పృద్వి, అరుణ, యాస్మిన్ లతోపాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.