70 ఏళ్ల యువకుడు
అతని పేరు సురేష్ జరివాలా. వయసు 70 ఏళ్లు. ఆయన్ను సైక్లింగ్ లెజెండ్‌గా పిలుస్తారు. ఆయన రోజు ఉదయం 5.45 గంటలకు తన దినచర్యను ప్రారంభిస్తారు. స్వతహాగా వస్త్ర వ్యాపారవేత్త అయినా ఆయన ఫిట్‌నెస్‌కి వీరాభిమాని. వ్యాపారిగా తన కెరీర్‌ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్‌పైనే రాకపోకలు సాగిస్తున్నాడు. మెరిసే కార్లు, బైక్‌లు ఆయనను ఆకర్షించలేకపోయాయి.
ఎందుకంటే సూరత్‌లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడూ.. సైకిల్‌పైనే వెళ్లేవాడు. ఆ తర్వాత 1982లో ఫ్యాక్టరీ అంక్లేశ్వర్‌కు మారినా.. అతని తీరు మారకపోవడం విశేషం. నిజానికి సూరత్‌ని సలాబత్‌పురా నుంచి అంక్లేశ్వర్ రావాలంటే కచ్చితంగా కారు లేదా బైక్ ఉంటేనే వెళ్లడం సాధ్యం. ఎందుకంటే ఈ తాతగారు సూరత్‌లోని తన ఇంటి నుంచి స్టేషన్‌కి మూడు కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి.. అక్కడి నుంచి రైలులో ప్రయాణించి అంక్లేశ్వర్‌కు చేరుకుంటారు.
ఆ తర్వాత అక్కడ స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి మరో నాలుగు కిలోమీటర్లు సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. అయినా సరే ఆయన సైక్లింగ్ వదిలేయలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. 1990లలో రూ.2000 పెట్టి అట్లాస్ కంపెనీ సైకిల్ కొనుకున్నారు. ఇప్పటికీ దానిపైనే ప్రయాణించడం చూస్తే.. ఆ సైకిల్‌ని ఆయన ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తున్నది.
ఇక ఆయనది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. జరివాలాకు నలుగురు సోదరులు. వారిలో చిన్నవాడు ఆయనే. పెద్ద అన్న వయసు 80 ఏళ్లు. చిన్న మనవడికి మూడేళ్లు. ఆయన క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవన విధానం తమకు స్ఫూర్తి, ఆరాధ్యనీయమైనదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ మావల్ల సాధ్యం కావడం లేదని అంటున్నారు వారంతా.
ఇంత బిజీ లైఫ్‌లో కూడా ఆయన రోజూ 10వేల అడుగులైనా వాకింగ్ చేస్తాడట. మారథాన్, రన్నింగ్ రేస్ వంటి అన్నింటిల్లోనూ పాల్గొటాడట. మరో విశేషం ఏంటంటే.. మహారాష్ట్రలోని షిర్డీకి సుమారు 300 కిలోమీటర్లు సైకిల్‌పైనే వెళ్తాడట సురేష్ జరివాలా. ఆయన జీవన విధానం పర్యావరణ హింతగానూ ఆరోగ్యప్రదంగానూ ఉంది. చెప్పాలంటే 70 ఏళ్ల వయసులో కూడా క్రమశిక్షణాయూతంగా జీవించడానికి ఉదాహరణ సురేష్ జరివాలా జీవన విధానం.






