13-09-2025 03:51:00 AM
శిథిలావస్థకు చేరి కుప్పకూలిన నిజాం కాలం నాటి భవనం
1941 లో కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తి
కూలిన భవనాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ
అదిలాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాం తి): అది నిజాం కాలం నాటి అతి పురాతన భవనం... బ్రిటిష్ పాలన అధికారుల నుంచి నేటి జిల్లా కలెక్టర్‌ల వరకు అక్కడి నుండే పాలన సాగించిన ప్రస్థానానికి దర్పణంగా నిలిచిన ప్రాచీన భవనం... అనేక మంది ప్రజలకు విశేష సేవలందించిన పరిపాలన సౌదం.. నిజాం నవాబు నియమించిన అధికారులతో పాటు అధికారికంగా ఇప్పటి వరకు 57 మంది జిల్లా కలెక్టర్‌లు పాలన సాగించేందుకు వేదికగా నిలిచిన ఆ భవనం తన సేవలను ఇక చాలించింది.
అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం లోని ఓ భాగం గురువారం రాత్రి కుప్పకూలిన సంగతి తెలిసిందే. భవనంలోని మిగితా విభాగాలు సైతం అదే శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఉండటంతో ఉన్నతాధికారులు, ఉద్యోగులకు, సిబ్బంది బిక్కు బిక్కుమంటున్నారు. దింతో జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక రోజు సెలవు ప్రకటించారు. మిగితా గదుల్లో ఉద్యోగులు పని చేసేందుకు జంకుతున్నారు.
ఘనమైన చరిత్ర..
గతంలో నిజాం కాలంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ ఉండేది. 1937లో జిల్లా కేంద్రాన్ని ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా మార్చాడంతో ఉమ్మడి జిల్లాగా ఆవిర్బవించింది. అదే ఏడాదిలో ఆదిలాబాద్ లోని ఏడు ఎకరాల భూమిలో ప్రస్తుత కలెక్టరేట్ భవనం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. సున్నపురాయి ఇటుకల తో నిర్మించిన రెండంతస్తుల భవనం 1941లో నిర్మాణం పూర్తి కావడంతో అదే ఏడాదిలో వీ.కె. వేలోడి అనే సివిల్ అడ్మినిస్ట్రెటర్ ఈ భవనాన్ని ప్రారంభించినట్లు విశ్రాంత రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
అప్పటి నుంచి నిజాం పాలనలో హైదరాబాద్ సివిల్ సర్వేంట్ అధికారులు ఐదుగురు పాలించగా... మరికొన్ని ఏళ్ళు ఈవీ రామారెడ్డి, సుందర్ రామన్ అనే ఇద్దరు ఐఏఎస్ లు పాలించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత అధికారికంగా ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. ఈ సమయంలో తొలి జిల్లా కలెక్టర్ గా బీ.ఎఫ్. దిత్యా అనే ఐఏఎస్ అధికారి 1956 నుంచి 1958 వరకు ఈ కార్యాలయం నుంచి పరిపాలన ప్రారంభించారు.
ఇప్పటి వరకు మొత్తం 52 మంది కలెక్టర్ లు ఇదే భవనం నుండి పరిపాలన సాగించాగా, ప్రస్తుత జిల్లా కలెక్టర్ రాజర్శి షా 53వ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోపక్క తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ప్రస్తుత కలెక్టర్ తో కలిపి ఎనిమిది మంది పరిపాలించారు. కాగా ఈ భవనం కొన్నేళ్ల నుంచే శిథిలావస్థలో ఉన్నప్పటికీ ప్రభుత్వం మరమత్తులు చేయలేదు. 2018లో మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 3.05 కోట్లు మంజూరు చేసినా నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
కొలిక్కి రాని నూతన సమీకృత భవనం
మరోపక్క పట్టణ శివారులో నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడిచినా పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి. ప్రస్తుత కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరడంతో, నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో భూమి పూజ చేశారు. అయితే ప్రస్తుతం నిధుల కొరత వల్ల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కూలిన భవనాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ
జిల్లా కలెక్టరేట్‌లోని ఏ సెక్షన్ విభాగం పై కప్పులు కూలిపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి వచ్చిన ఓ ప్రైవేట్ కన్సల్టేన్సీ ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూలిపోయిన భవనాన్ని పరిశీలింది. జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఏవో వర్ణ, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి బృందం సభ్యులు కూలిన భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కలిసి భవనానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఐతే ప్రస్తుత పరిపాలన కోసం పట్టణంలో అందుబాటులో ఇతర భవనాలు ఎక్కడ ఉన్నాయో అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. కాగా ఘనమైన చరిత్ర కలిగిన ఈ భవనం కూలిపోవడంతో ఇక్కడ పని చేసిన అధికారులు, ఉద్యోగులు, ప్రజలు కూలిన భవనాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.