13-09-2025 03:47:58 AM
ముగిసిన జాడి వెంకటి 30 ఏళ్ల మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం
శోక సంద్రంలో చంద్రవెల్లి
బెల్లంపల్లి, సెప్టెంబర్ 12 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి అలియాస్ సురేష్ 30 ఏళ్ల విప్లవ ప్రస్థానం గురువారం జరిగిన చత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. చత్తీ స్‌ఘడ్ రాష్ర్టంలోని గరియాబంద్ దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ లోని వరంగల్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్, ఒడిశా రాష్ర్ట కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రేమ్‌దాదా అలియాస్ చంద్రన్న లతో పాటు సుకుమా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలకు చెందిన ఏడుగురు మావోయిస్టులతో పాటు తెలంగాణ ప్రాంతంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి అలియాస్ విమల్ అలియాస్ మంగన్న, అలియాస్ సురేష్ మృతి చెందినట్లు చత్తీస్ ఘడ్ పోలీసులు నిర్ధారించారు. ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన జాడి వెంకటి మృతదే హం వద్ద ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధాన్ని స్వాధీ నం చేసుకోగా అతనిపై చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో కలుపుకొని రూ 18 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు ప్రకటించారు. జాడి వెంకటి బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
బెల్లంపల్లి తహసీల్ కార్యాలయంలో పనిచేస్తున్న క్రమంలోనే..
గరియాబంద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జాడి వెంకటి 1986 లో చంద్రవెల్లి గ్రామానికి చెందిన ఆవుల బాలమ్మను వివాహం చేసుకున్నారు. 1994 లో బెల్లంపల్లి తహసీల్ కార్యాలయంలో సుంకరిగా పనిచేశారు. సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లిలో సి.కా.స(సింగరేణి కార్మిక సమాఖ్య) కార్యకలాపాలు ఉదృతంగా కొనసాగాయి. బెల్లంపల్లికి స్థానికంగా ఉండే నెన్నెల మండలం ఆవుడం గ్రామంలో టేకు కర్ర వ్యాపారం కొనసాగిస్తుండగా అప్పటి సి.కా.స నక్సలైట్లతో పరిచయం ఏర్పడింది.
అప్పటినుంచి బెల్లంపల్లి తహసీల్ కార్యాలయంలో సుంకరిగా పనిచేస్తూ 1997 వరకు సి.కా.స నక్సలైట్లకు కొరియర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొవడం, జైల్‌కు వెల్లడం తట్టుకోలేక విడుదలై మళ్లీ అడవి బాట పట్టారు. 1999 తర్వాత తన భార్య ఆవుల బాలమ్మ అలియాస్ జాడి పుష్పను కూడా తనతో పాటే అజ్ఞాతంలోకి తీసుకెళ్లా డు. అప్పటినుంచి జాడి వెంకటి దంపతులు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూ దండకారణ్య ప్రాంతంలో పనిచేశారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
జాడి వెంకటి మృతి చెందారన్న చేదువార్త తెలియడంతో చంద్రవెల్లి గ్రామంలోని అతని కుటుంబ సభ్యులు శోకసంద్రం లో మునిగిపోయారు. తల్లిదండ్రులు చనిపోయిన వెంకటి ఇంటి ముఖం చూడలేదని అతని చిన్నమ్మ జాడి రాజమ్మ కన్నీళ్ల పర్యంతమైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరి కొంత మంది మావోయిస్టులను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నట్లు నారాయణపూర్ పోలీసులు చెబుతుండడంతో అజ్ఞాతంలో ఉన్న ఆవుల బాలమ్మ అలియాస్ పుష్ప తల్లి మల్లమ్మ, సోదరులు గంగయ్య, శ్రీనివాస్, చెల్లెలు కళాలి రామక్క, రామటెంకి సుజాత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మావోయిస్టుల్లో పనిచేస్తున్న బాలమ్మ జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రాణాలు పోగొట్టుకోవద్దని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.