13-09-2025 11:15:12 AM
మిజోరం అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మిజోరంలోని అయిజోల్ లో పర్యటిస్తున్నారు. బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. రైల్వేలైన్ తో భారతీయ రైల్వే నెట్ వర్క్ తో అయిజోల్ అనుసంధానం చేయబడింది. సైరాంగ్ నుంచి ఢిల్లీ, గవాహటి, కోల్ కతాలకు మూడు నూతన రైళ్లకు ప్రారంభోత్సవం చేశారు. వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ... దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. కొండ ప్రాంతంలో రైలు మార్గం కష్టతరంతో కూడుకున్నదని చెప్పారు. సవాల్ తో కూడిన నిర్మాణాలు అద్భుతం అన్నారు. ఈ రైల్వేలైన్ వల్ల భారతీయ రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానమవుతుందని చెప్పారు.
పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశముందని తెలిపిన ప్రధాని మోదీ ఏ రాష్ట్రాభివృద్ధికైనా రోడ్డు, రైల్వే, పోర్టు కనెక్టివిటీ ముఖ్యమని పేర్కొన్నారు. మిజోరం అభివృద్ధికి(Mizoram Development) కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. వేగవంతమైన దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మిజోరాంలో రవాణా సౌకర్యాలు పెంచామన్నారు. నూతన రైళ్ల ప్రారంభోత్సవంతో రవాణా సౌకర్యాలు మెరుగువుతాయని సూచించారు. కష్టతరమైన కొండ ప్రాంతాల్లో రైల్వే సౌకర్యం సంతోషకరం అన్నారు. ఇంజినీర్ల, నైపుణ్యం, కార్మికుల స్ఫూర్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని కొనియాడారు. అనేక సవాళ్లను అధిగమించి రైల్వే లైను నిర్మాణం పూర్తి చేశారని చెప్పారు. ఇంజినీర్లు, కార్మికుల నిరంతర కృషి వల్ల నూతన మార్గం వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు. నూతన రైల్వే లైన్ వల్ల తొలిసారిగా ఢిల్లీతో నేరుగా అనుసంధానమైందని తెలిపారు.