calender_icon.png 13 September, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నిమజ్జనంలో విషాదం.. ఎనిమిది మంది మృతి

13-09-2025 09:54:48 AM

హసన్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం(Karnataka Road Accident) జరిగింది. శుక్రవారం రాత్రి హసన్ జిల్లాలోని(Hassan district) ఒక గ్రామంలో గణేశ నిమజ్జన ఊరేగింపుపైకి (Ganesha Procession) ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. గణేశ చతుర్థి వేడుకల చివరి రోజు రాత్రి 8.45 గంటల ప్రాంతంలో మోసలే హోసహళ్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మరణించిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం హసన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అరకలగూడు నుండి వస్తున్నట్లు భావిస్తున్న ట్రక్కు నియంత్రణ కోల్పోయి భక్తులపైకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లారీ చక్రం కింద చిక్కుకుని దాదాపు నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని గ్రామస్తులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి  చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఈ ప్రమాదంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామి(Haradanahalli Devegowda Kumaraswamy) విచారం వ్యక్తం చేస్తూ, "హాసన్ తాలూకాలోని మోసలే హోసహల్లిలో గణపతి నిమజ్జన ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారనే వార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను" అని తెలిపారు. "గణపతి ఊరేగింపులో పాల్గొన్న వారిపై ట్రక్కు దూసుకెళ్లడంతో భక్తులు ప్రాణాలు కోల్పోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇది చాలా విషాదకరమైన సంఘటన." అన్నారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలని జెడిఎస్ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.