23 March, 2026 | 3:09 AM

మాది పీపుల్స్ బడ్జెట్

23-03-2026 01:18 AM

మా పాలనలో కుల మతబేధాలకు స్థానం లేదు.

రైతుల సంక్షేమమే మా లక్ష్యం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం (కూసుమంచి), మార్చి 22(విజయక్రాంతి): మాది పీపుల్స్ బడ్జెట్.. సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే సంఖ్య లు ఇవి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం, ఈ రాష్ట్రంలో జీవించడం మా భాగ్యం అన్న భరోసాను ప్రభు త్వం కల్పిస్తుంది. బిడ్డ పుట్టినప్పటినుంచి చనిపోయే పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఒక ప్రభుత్వ పథకం దేశంలో ఎక్క డా లేని రీతిలో ఈ రాష్ట్రంలో అందుతుంది అన్నారు.

కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా రాష్ట్రంలో అందరికీ 5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకం  అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మన పిల్లలే రేపటి సంపద, వారి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా భావించి వారంలో ఆరు రోజులు పౌష్టిక ఆహారం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఎదిగే పిల్లలకు బలమైన ఆహారం ఇస్తే మెదడు చురుకుగా పని చేస్తుందని తెలిపారు. యుక్త వయసులో తమ కెరీర్ కు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చామన్నారు.

విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంగ్లిష్ మీడియాని ప్రోత్సహిస్తున్నామన్నారు. వారం వారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తాం, ఈ సంవత్సరం కూడా నియోజకవర్గానికి 1000 చొప్పున మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండొద్దనేదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంత త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అంత త్వరగా బిల్లులు చెల్లిస్తామన్నారు. పని లేని వారికి పని కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఉద్యోగస్తుల కుటుంబాలకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులు.. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ తరహా పథకం తీసుకొచ్చామన్నారు.

ప్రభుత్వ ఉద్యోగికి ప్రమాదం జరిగితే 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా. 60 సంవత్సరాల వరకు పది లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు.రాష్ట్రంలో అనేక రంగాలకు రాయితీలు కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే 68,89,955 పట్టాదారులకు 3446.94 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేశామన్నారు. జీడీపీలో దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచేందుకు క్యూర్, ప్యూర్, రేర్ పాలసీని తీసుకువచ్చామన్నారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో గిరిజనులకు సాగు భూములపై హక్కులు కల్పించామన్నారు.

మన యూనివర్సిటీలను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లేందుకు, హార్వర్డ్ , స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలకు టీటుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది. చరిత్రలో మొదటిసారి గోదావరి పుష్కరాలకు 440 కోట్లు కేటాయించాం. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పనులు ప్రారంభించాం. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, నగర కాంగ్రెస్ కమిటి మాజీ అధ్యక్షులు మహ్మద్ జావేద్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంఘ అధ్యక్షులు దొబ్బల సౌజన్య,వేజండ్ల సాయి కుమార్, సయ్యద్ గౌస్, మొక్కా శేఖర్ గౌడ్, కాపా మురళి కృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్,వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,మూడుముంతల గంగరాజు యాద వ్, పగడాల మంజుల, బుక్క కృష్ణవేణి,కిలారి అనిల్ కుమార్, గాదెల ఝాన్సీ, శ్రీలత, కాపా సుధాకర్ పాల్గొన్నారు.