23 March, 2026 | 4:20 AM

అన్నదాతకు పెద్దపీట

23-03-2026 12:53 AM

పంటమార్పిడితోనే బంగారు తెలంగాణ

  1. వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం తేవాలి 
  2. సిద్దిపేటపై మాకు వివక్ష లేదు
  3. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తాం 
  4. నర్మెట్టలో ఆయిల్ ఫామ్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 
  5. రైతు భరోసా నిధులు విడుదల

సిద్దిపేట, మార్చి 22 (విజయక్రాంతి)/నంగునూరు : రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికం గా ఎన్ని ఒడిదుడుకులున్నా.. రైతాంగానికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మారిన పరిస్థితుల్లో పంట ల మార్పిడితోనే బంగారు తెలంగాణ సిద్ధిస్తుందని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తమకు సమానమేనని సిద్దిపేటపై ఎలాంటి వివక్షత లేదని ఈ సం దర్భంగా చెప్పారు. ఎద్దేడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం నిలువదని నమ్ముతానని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో తన కు రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ ఆ నియోజకవర్గాలలోని ప్రజలపై విభేదాలు లేవని, అక్కడ కూడా పేద ప్రజలు ఉన్నారని.. వారందరికీ సంక్షేమ పథకాలు అం దించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అందుకే సిద్దిపేట నియోజకవర్గంలో ఆయి ల్ ఫామ్ పరిశ్రమ మొదటగా నిర్మించి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఆ తర్వాత నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తుందని.. అప్పుడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తా మంటూ సీఎం ప్రకటించారు.

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యేలు పరిశ్రమ ప్రారంభోత్సవానికి వస్తే స్వాగతించేవాళ్ళమని, రాజకీయం చేసేవాళ్ళం కాదం టూ వెల్లడించారు. 

ఆర్థికంగా మహిళలు ఎదగాలి..

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆత్మగౌరవంగా బతకగలుగుతారని చెప్పారు. రాష్ట్రం లో ప్రతి మహిళ ఉచిత ప్రయాణం చేసే విధంగా మీ తమ్ముడు రేవంత్‌రెడ్డి కృషి చేశాడని తెలిపారు. టాలెంటు ఉంటే ప్రపంచం వారి ముందు తలవంచుతుందని అందుకే ఏ టి సి సెంటర్లు ఏర్పాటు చేసి అందులో అడ్మిషన్ పొంది చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి నెల రూ.2వేలు ఇస్తున్నామని వెల్లడించారు.

ఇప్పటికి మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారని, ఇం కా పది లక్షల ఎకరాలల్లో సాగుచేసినా, కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యూ రియా, గ్యాస్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని.. అందుకే రైతులకు నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు.

రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలతో కలిసి వెళ్లి రాష్ట్రానికి అవసరమైన యూరియా, గ్యాస్ సరఫ రా చేసే విధంగా ప్రధానమంత్రి మోదీని కోరాలని మంత్రులను ఆదేశించారు. ఆయి ల్ ఫామ్ లాభ దాయకమైన పంట సాగని, రైతులు పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో క్వింటాలు పసు పు అమ్ముతే తులం బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడు బంగా రం ధర పెరిగినా పసుపు ధర దానికి అనుకూలంగా పెరగలేదన్నారు. 

ప్రైవేటు చదువు మోజులో పడొద్దు..

రాష్ట్రంలో 18 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, అత్యంత నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని.. తల్లిదండ్రులు ప్రైవే టు చదువు మోజులో పడి మోసపోవద్దని చెప్పారు. రానున్న రోజుల్లో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. పాలు, రాగిజావ వంటివి ఇస్తూ పేద విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

ఆయిల్ పామ్ సాగువైపు మళ్లాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వరి సాగుకు ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్ పామ్ వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలుపై ఆంక్షలు విధిస్తున్న తరుణంలో, స్థిరమైన ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగు ఉత్తమమని పేర్కొన్నారు. నర్మెట్ట ఫ్యాక్టరీలో మలేషియా సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, ఇది గంటకు 30 నుంచి 120 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మరో 5 ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం టన్నుకు ఉన్న ధరను రూ. 21,546 నుండి రూ.25,000కు పెం చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

దూరదృష్టికి నిదర్శనం: మహేశ్‌కుమార్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల సంక్షే మం పట్ల స్పష్టమైన దూరదృష్టి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కొనియాడారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, రైతులకు లబ్ధి చేకూర్చేలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీకి కూడా శంకుస్థాపన జరిగిందన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకుంటేనే దేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

రైతు సంక్షేమమే లక్ష్యం: పొన్నం

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్డు రవా ణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్  కొనియాడారు. ఈ ప్రాజెక్టుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ఇలాంటి కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని  తెలిపారు.

భూ సమస్యలకు పరిష్కరించాం: మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వం ధరణిని తీసుకువచ్చి రైతుల పాలిట నల్ల కాగితంలా మా ర్చిందని, ఆ ఇబ్బందులను తొలగించి భూ భారతి ద్వారా పారదర్శకమైన భూపాలన అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నా రు. రాజకీయాలకు అతీతంగా, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మం జూరు చేస్తామని హామీ ఇచ్చా రు. సాదాబైనామాల సమస్యలను త్వరలోనే పరిష్కరి స్తామనీ తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆయిల్ పామ్‌ను ప్రోత్సహిస్తామన్నారు.

రైతు పక్షపాతి రేవంత్‌రెడ్డి: మంత్రి వివేక్

రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొనియాడారు. అప్పుల ఊబిలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 21,000 కోట్లతో రుణమాఫీ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఆయన నిజమైన రైతు పక్షపాతి అని వివేక్ పేర్కొన్నారు. విద్యారంగంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందు లో భాగంగానే సిద్దిపేట జిల్లాకు రెండు ఇం టిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్లను ముఖ్యమంత్రి మం జూరు చేశారని వెల్లడించారు.

సామాజిక న్యాయం, పేదల ఆరోగ్యమే లక్ష్యం: మంత్రి దామోదర

 రాష్ట్రంలో సామాజిక న్యాయం చేకూర్చడంతో పాటు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ పేదవాడికి నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడమే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శాఖలో సుమారు 10,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన పేర్కొన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలి : ఎంపీ రఘునందన్

గజ్వేల్ రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయ్యే లోపు గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్ ప్రాంతా ల్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. వ్యవసాయ భూములకు నష్టం కలగకుండా రైతులకు మేలు చేసేలా వ్యవసాయ ఆధారి త పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకురావాలన్నారు. దుబ్బాకలో అభివృధి పనులు సంబంధించి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు.

45 రోజుల్లో రైతు భరోసా పూర్తి.. 

ప్రజా పాలన ప్రణాళిక లో భాగంగా రైతులకు 45 రోజుల్లో రైతు భరోసానిధులు దశలవారీగా ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. నర్మెట సభలో రైతు భరోసా నిధులు రూ 3.400 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. 70 లక్షల మంది రైతులకు ఈ నిధులు చేరుతాయని మొత్తం నిధులన్నీ 20 రోజులకు ఒక దశగా మొత్తం 45 రోజుల్లో రైతు భరోసా నిధులు ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు.

114 నెలలు కేసీఆర్ పరిపాలించి నెలకు రూ. 2,53 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుతం రైతుల కోసం ప్రతినెల 5,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కరెంటు బోనస్, భరోసా, బీమా ఇలా అనేక విధాలుగా రైతులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు. అకాల వర్షాలు కురిసినప్పుడు కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా రైతులు నష్టపోతున్నారని గుర్తుచేస్తూ, ఎకరానికి 10,000 నష్టపరిహారం చొప్పున ఇప్పటివరకు రూ. 1,33 వేల కోట్లు ఇచ్చామన్నారు. రైతును రాజును చేయాలని, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే రైతుబిడ్డగా తన లక్ష్యమని వెల్లడించారు.