23 March, 2026 | 2:42 AM

అన్నదాత బతుకు ఆగమాయె.. ఉత్సవాలెక్కడ?

23-03-2026 01:03 AM

నిర్దిష్ట ప్రణాళిక కరువై రైతుల ఆత్మహత్యలు

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి నెట్‌వర్క్): ముందు దగా వెనుక దగా కుడి ఎడమల దగా దగా అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు రాష్ట్ర రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, కౌలు రైతులకు సాయం, ప్రతి పంటకు బోనస్ లాంటి ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులు సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయి లో అందుకు విరుద్ధంగా ఉంది. రైతు ఉత్సవాల మాటున రైతుల కన్నీటి గాథలు విషాదాన్ని నింపుతున్నాయి. ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి సక్రమంగా అమలుకు నోచుకో కపోవడం, నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతు న్నాయి. రైతు భరోసా రైతులకు తీరని వ్యథగా మారింది.

ఎకరానికి కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున పెట్టు బడి సాయంగా ఇస్తామని హామీ ఇచ్చి 2024లో మొత్తం ఇవ్వకుండానే ఎగ్గొట్టింది. 2023 అక్టోబర్‌లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ దానిని అడ్డుకుంది. ఏడాదిగా రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడేమో ఎకరానికి రూ.12 వేలు మాత్రమే ఇస్తామ ని ప్రకటించింది. అదికూడా సాగు యోగ్యత కలిగిన భూమికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది. 

ఎన్నో ఇబ్బందులు పడి రైతులు వరి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసిన రైతులు ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తు న్నారు. ఎన్నికల వేళ ఎకరాకు రూ.7,500 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నిలబెట్టుకో వడంలో విఫలమైంది. తీరా ఎకరాకు రూ. 6 వేలు ఇస్తామని ప్రకటించి పంపిణీ ప్రక్రియను ప్రహసనంగా చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి ముగిసినా డబ్బులు జమ కాలేదు.

కేవలం నాలుగెకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం పైసలు రాగా.. మిగతావారు తమకు సాయం ఎప్పుడు అందుతుందో అని ఎదురుచూస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసింది. రైతు లకు సీజన్‌కు ముందుగానే ఎకరాకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అం దజేసింది. దీంతో రైతులు రెండు సీజన్లలో తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా సాగుచేసి లాభాలు పొందారు.

ఇప్పుడు ఎకరానికి రైతులు దాదాపు రూ.25 వేల చొప్పున పెట్టుబడులు పెట్టారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి డబ్బు తెచ్చిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభు త్వం అదనంగా ఎకరాకు రూ. 2,500 అంటే మొత్తం రూ.7,500 ఇస్తామని ప్రకటించడంతో ఎంతో ఆశపడిన రైతులు ప్రభుత్వ నిర్ణయం ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు.

కాగా రైతు భరోసా కింద ఎకరాకు ప్రతీ ఏడాది రూ.15 వేలు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రెండు సీజన్‌లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పెట్టుబడి సాయం పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. రెండు సీజన్‌లలో ఎకరాకు రూ.12 వేలు మాత్రమే అందిస్తున్నారు.

ప్రహసనంగా రుణమాఫీ..

రెండేళ్ళుగా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని ప్రతిపక్షాలతో పాటు రైతాంగం కూడా విమర్శలు చేస్తోంది. రూ. 2 లక్షల రుణమాఫీని 2023 డిసెంబర్ 9న మొదటి సంతకంతో ప్రారంభిస్తానని చెప్పి మాట తప్పి రేవంత్ సర్కారు మోసంచేసింది.

రుణమాఫీపై నాన్చివేత వైఖరిని ప్రతిపక్షాలు గట్టిగా ఎండగట్టడంతో దిగివచ్చిన ప్రభుత్వం ఆగస్ట్ 15 లోగా పూర్తి చేస్తామని రాష్ట్రంలోని అందరి దేవుళ్లపైనా ఒట్టువేసి ప్రజల సెంటిమెంట్‌ను వాడుకొని పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కింది. రుణమాఫీకి సవాలక్ష కండిషన్లు పెట్టడంతోపాటు రూ. 31 వేల కోట్లకు కుదించి, బడ్జెట్‌లో రూ. 26 వేల కోట్లు ప్రతిపాదించి కేవలం రూ. 20.16 వేల కోట్లను 25.35 లక్షల రైతులకు మాత్రమే మాఫీచేసి రుణమాఫీ అయిపోయిందని కాంగ్రెస్ దబాయిస్తున్నది. బోనస్ విషయంలో అంతే జరిగింది. 

బోనస్ పేర బోగస్ వాగ్దానాలు..

వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరకు, జొన్నలు వంటి 10 పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఆ హామీ బోగస్‌గా మారింది. తొలుత అన్ని వడ్లకు ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్నాలకేనని కోతలు పెట్టింది. గత సంవత్సరం వానకాలంలో 156 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, ప్రభుత్వం కొనుగోలు చేసింది 50 లక్షల టన్నులే. పండిన ధాన్యం లో 30 శాతం కొనుగోలు చేసి బోనస్ అమలు చేశామని గొప్పలు చెప్పుకున్నది.

రైతు కూలీలకు మొండిచేయి..

వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ మరో హామీనిచ్చినా ఇప్పటివరకు భూమి లేని రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. ఇచ్చిన హామీని అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని రెండేళ్ళ క్రితం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హడావుడిగా ప్రకటించారు. కానీ దీనికి ఎలాంటి విధివిధానాలు ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.

ఆరు గ్యారంటీలకు మోక్షం దక్కేనా?

ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ రెండేళ్లు దాటినా ఒక్క దానినీ సంపూర్ణంగా అమలు చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు ఇంటి స్థలం, మహిళలకు రూ. 2,500 భృతి, రూ. 4 వేల పెన్షన్ వంటి హామీలు మొదలే కాలేదు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం జాడే లేదు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు, అంగన్వాడీ, ఆశ, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జీతాల పెంపు, కామారెడ్డి, వరంగల్ డిక్లరేషన్ మొదలగునవి కనుచూపు మేరలో లేవు.

కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..

రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత, ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దురదృష్టవశాత్తు, హఠాత్తుగా ఇంటి పెద్ద మరణిస్తే సదరు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న భావనతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని తీసుకురాబోతోంది. ఈ పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించగా, పథకం కోసం ఈ బడ్జెట్లో రూ.4వేల కోట్లను కేటాయించింది.

ఇంటిపెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కాగా ఈ పథకం కోసం కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకోనున్నారని, ఇంటి పెద్దకే బీమాను వర్తింపచేసే అవకాశాలున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. అలాగే రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగి ఉన్న కుటుంబాలనే అర్హులుగా గుర్తించనున్నట్టు సమాచారం. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రైతు బీమా పథకం రద్దవుతుందా?

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథ కం ప్రకటనతో రైతుబీమా రద్దవుతుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికి పైగా రైతులకు రైతుభరోసా పథకం కింద ఆర్థిక సాయం అందుతుండగా, ఇందులో 42 లక్షల మంది కి రైతు బీమా పథకం వర్తిస్తోంది. అంతేకాకుండా భూమి ఉండి, అర్హత ఉండి, ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ రైతుబీమా పథకం అమలవుతోంది.

గత బడ్జెట్‌లో రైతుబీమాకు రూ.1,167 కోట్లను కేటాయించగా, ఈసారి నిధులు కేటాయించలేదు. దీంతో రైతు బీమాను రద్దు చేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రైతుబీమాను జీవిత బీమా కిందకు తీసుకువస్తే.. ఒకే ఇంట్లో ఇద్దరికి పాసు పుస్తకాలు ఉండి, వారిద్దరూ రైతుబీమా కింద అర్హులై ఉంటే.. అప్పుడు వారిలో ఎవరికి బీమా అం దుతున్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

పంట నష్టం డబ్బులు రాలే..

గత వర్షాకాలంలో విపరీతమైన వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండి బ్యాక్ వాటర్ రావడంతో మా పంట పొలాలన్నీ నీట మునిగాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఇప్పటికీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. రైతు భరోసా డబ్బులు ఇస్తామనిచెప్పి ఇప్పటికీ లేవు, మాటతప్పిన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. రైతుల మేలుకోరే ప్రభుత్వం కాదు. రుణమాఫీ కూడా రెండు లక్షలు దాటిన రైతులకు రాలే. నాలుగు ఎకరాలకు పైబడిన రైతులకు రైతు భరోసా రాలే, కొత్త పింఛన్లు ఇప్పటికీ ఇవ్వలేదు.

 దుర్గయ్య, రైతు.. చినూరు, కామారెడ్డి జిల్లా

రైతువి తీరని కష్టాలు.. 

తెలంగాణ ప్రభుత్వం యూరియా కొరత తీర్చేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన యూరియా యాప్ వల్ల రైతులకు తీవ్రఇబ్బంది కలుగుతున్నది. రైతులు యూరియా బుక్ చేసుకోవడం  రాకపోవడంతో   రైతు గోస  చాలా ఇబ్బం దికరంగా మారింది.  ఇతరుల దగ్గరకు వెళ్లి బుక్ చేయమని అడిగితే  ఒక యూరియా బస్తా మీద అదనంగా డబ్బులు తీసుకొని బుక్ చేస్తున్నారు. సరైన సమయంలో  యూరియా  పంటకు అందకపోవడంతో సరైన దిగుబడి రాలేక నష్టపోతున్నాం. ప్రభుత్వం అన్నీ చేస్తున్నట్లు చెప్తున్నా, రైతులకు మాత్రం న్యాయం చేయలేకపోతోంది. మొత్తానికి రైతువి తీరని కష్టాలు.. భరోసా లేని బతుకులుగా మారిపోయాయి.

 బొంగు వెంకటేష్, 

రైతు, తాళ్ళసింగారం, చౌటుప్పల్

ఇబ్బందులు లేకుండా చూడాలి.. 

 రైతులు పండించిన పంట చేతికొచ్చే సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చేయాలి. గతంలోలాగా ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత సీజన్లో రైతులకు ఇస్తామన్న బోనస్ డబ్బులు కొంత ఆలస్యం కావడం, కొందరు రైతులకు బోనస్ కొద్దిమేర పడాల్సి ఉండగా రైతులు నెలలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటుచేయడంతో పాటు డబ్బును సరైన సమయానికి చెల్లించి, బోనస్‌ను కూడా వెంటనే అందించి రైతన్నలకు అండగా నిలబడి, ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

 దలువాయి సదానందరావు, 

రైతు, తిమ్మాపురం గ్రామం, జాజిరెడ్డిగూడెం మండలం  

మాట తప్పిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి కూడా అమలుచేయడం లేదు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనం పట్టించుకోవడం లేదు. మాటలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు నేనున్నా అని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఒక్కటి కూడా రైతులకు పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. రైతు రుణమాఫీ, రైతుభరోసా, యూరియా, సన్న వడ్లకు 500 బోనస్ కూడా పూర్తిస్థాయిలో రైతులకు అందలే. ఈ ప్రభుత్వం రైతుల ప్రయోజనం కన్నా కోతలే ఎక్కువ పెడుతున్నది.

 శ్రీనివాస్‌గౌడ్, రైతు, కంచర్ల, కామారెడ్డి జిల్లా 

రైతులను నట్టేట్ట ముంచుతున్న ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టెట్ట ముంచుతున్నది. డిసెంబర్‌లో అందాల్సిన రైతుభరోసా మార్చిలో విడుదల చేస్తే ఏం లాభం. అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టుకున్నాం. సమయానికి రైతుభరోసా ఇవ్వకపోతే అప్పులు చేయాల్సి వచ్చింది. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతు బీమా ఆగలేదు. ఈ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది.

 సభావత్ బిలియానాయక్ రైతు, 

కట్రీయాల తండా, మెదక్ జిల్లా.