చెక్‌డ్యామ్‌కు గండి.. రైతులకు గండం!
- మునిమోక్షం శివారులో నీరు నిల్వ కాక.. 60 ఎకరాల పంటలపై ప్రభావం
- అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని రైతుల వేడుకోలు
- నాసిరక నిర్మాణమే కారణమా?
హన్వాడ, ఆగస్టు 30 : మండలం మునిమోక్షం శివారులో రైతుల సాగుకు కీలకంగా ఉన్న చెక్డ్యామ్ దెబ్బతినడంతో నీరు నిల్వ లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ చెక్డ్యామ్లో (At the check dam) నీరు నిల్వ ఉంటే పరిసర ప్రాంతాల్లోని సుమారు 60 ఎకరాల పంట పొలాలకు భూగర్భ జలాలు అందడంతో పాటు 30 నుంచి 40 మంది రైతుల బోరుబావులకు నీటి లభ్యత పెరుగుతుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నీటి ఉధృతి పెరగడంతో చెక్డ్యామ్కు గండి పడింది.
దీంతో నీరు నిల్వ కాకుండా బయటకు వెళ్లిపోతోంది. చెక్డ్యామ్కు మరమ్మతులు చేయకపోతే రాబోయే రోజుల్లో బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెక్డ్యామ్ భూగర్భ జలాల రీఛార్జ్కు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు పేర్కొంటున్నారు.
నాసిరక నిర్మాణమే కారణమా?
చెక్ డ్యాములు అంటేనే వాగుల మధ్యలో గాని నీరు ఎక్కువగా పారుతున్న సమయంలో అడ్డుగా వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. అడవి ప్రాంతాలలో నిర్మించే ఈ చెక్ డాంల నిర్మాణం అసలు సరిగా ఉంటుంద లేదా అనే కోణాల్లో కూడా అధికారులు విచారణ చేస్తే బాగుంటుంది.
ఏదో నిర్మించారు వదిలేశారు ఇప్పుడు గండి పడింది అంటే నిర్మాణం చేయు సమయంలో సరిగ్గా జరిగిందా లేదా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత కాంట్రాక్టర్ గాని నిర్మాణ లోపం ఉంటే పర్యవేక్షణ అధికారులతో పాటు బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు చెబుతున్నారు.
వెంటనే మరమ్మతులు చేపట్టాలని వేడుకోలు
ప్రస్తుతం వర్షపాతంలో మార్పులు, రుతుపవనాల అస్థిరత కారణంగా వర్షపు నీరు భూమిలోకి తగినంతగా ఇంకకుండా ప్రవాహాల రూపంలో వెళ్లిపోతోంది. దీంతో భూగర్భ జలాల రీఛార్జ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి, బోరుబావులపై ఆధారపడే రైతుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. కాలువల ద్వారా సాగునీరు అందని ప్రాంతాల్లో బోరుబావులే రైతులకు ప్రధాన ఆధారం. అలాంటి పరిస్థితుల్లో చెక్డ్యామ్ దెబ్బతినడం వల్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
అధికారులు వెంటనే చెక్డ్యామ్ను పరిశీలించి, నాణ్యమైన మరమ్మతులు చేపట్టి నీటిని నిల్వ చేసే పరిస్థితిని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. చెక్డ్యామ్కు సకాలంలో మరమ్మతులు చేపడితే వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాలను రీఛార్జ్ చేసి, సుమారు 60 ఎకరాల పంట పొలాలకు, 3040 మంది రైతుల బోరుబావులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
పశువులకు ఎంతో మేలుగా ఉండేది
ఈ చెక్ డాం ద్వారా పశువులకు చాలా కాలం వరకు నీరు పుష్కలంగా అందుబాటులో ఉండేది. దీంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బోర్ల లో కూడా పుష్కలంగా నీరు వచ్చేది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రైతు
అధికారులు స్పందించాలి
అధికారులు వెంటనే స్పందించి నీరు నిల్వకు ఎంతో అండగా నిలబడిన కలవటం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ చెక్ డ్యాం ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టిన నిర్మించాలి.
చెన్నయ్య, రైతు






