పీఏలపై నిఘా కరువు
- మితిమీరుతున్న ఆగడాలు
- అక్రమ వసూళ్లు, బెదిరింపులు
- చెడుపేరు తెస్తున్నా పట్టించుకోని నేతలు
మేడ్చల్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): నాయకుడికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాల్సిన పీఏలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నాయకుల నిఘా లేకపోవడం వల్ల వీరి ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో రెండు సంఘటనలు సంచలనం సృష్టించాయి. భద్రాచలం ఎమ్మెల్యే కార్తీక్ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. కోట్లలో వసూలు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ ఎస్ డి సుమంత్ గతంలో నల్గొండ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని డబ్బుల కోసం బెదిరించినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా చర్లపల్లి కి చెందిన ఒక వ్యాపారిపై డబ్బుల కోసం దాడి చేయగా కేసు నమోదు కాగా పరారీలో ఉన్నాడు. మేడ్చల్ జిల్లాలోనూ రాజకీయ నాయకుల పిఏలు అక్రమ వసూళ్లకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న వారిలో కూడా పలువురిపై ఆరోపణలు ఉన్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వద్ద పీఏ గా పనిచేసిన ఒక వ్యక్తి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు గత సంవత్సరం బయటపడింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. అలాగే మాజీ డిప్యూటీ మేయర్ వద్ద పనిచేసిన ఒక వ్యక్తి బోడుప్పల్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిఘా పెట్టని నాయకులు
రాజకీయ నాయకులు నిత్యం బిజీగా ఉండడం వల్ల తమకు సహాయంగా పీఏలను నియమించుకుంటున్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో తిరిగే నాయకుల వద్ద పీఏలు, సోషల్ మీడియా ఇన్చార్జీలు ఉంటున్నారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ఉద్యోగి పీఏ గా ఉన్నప్పటికీ ప్రైవేటు పీ ఏ లను కూడా నియమించుకుంటున్నారు. ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఫోటోలు తీయడానికి, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి, మీడియా ప్రతినిధులకు పంపడానికి ప్రైవేటు పీఏలను నియమించుకుంటున్నారు.
పిఏలు నాయకుల వెన్నంటి ఉంటున్నారు. నాయకుల వెన్నంటి ఉండడం, వివిధ ఫైల్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల నాయకుల అనుచరులు, ప్రజలు వీరిని ఆశ్రయిస్తున్నారు. నాయకులు సైతం వీరు చెప్పింది విశ్వసిస్తున్నారు. కానీ వీరి పనితీరు ఎలా ఉందని నిఘ పెట్టడం లేదు. రాజకీయ నాయకుల నిఘ లేకపోవడం వల్ల వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
దేశముదుర్లు పీఏలు
పీఏల వ్యవహార శైలిపై నాయకులు అనుచరులతోపాటు ప్రజలు కూడా విస్తుపోతున్నారు. కొన్ని సందర్భాలలో నాయకుల అనుచరులను, ప్రజలను పిఏలు కసురుకుంటున్నారు. ఎవరు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వరు. తామే పెద్ద నాయకులమని వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడవచ్చు గాని, పీఏ లతో మాట్లాడే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు.
జిల్లాలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, డిసిసి అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసే ఓడిపోయిన నాయకులకు, ఇతర ముఖ్య నాయకులకు పిఏలు ఉన్నారు.
వీరిలో చాలామంది పిఏలు ఎవరి ఫోన్ లకు స్పందించరు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు ఫోన్ లిఫ్ట్ చేస్తారు కానీ పిఏలు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయరు. వీరి వ్యవహార శైలి వల్ల రాజకీయ నాయకుడికి, ప్రజలకు మధ్య సంబంధాలు దూరమవుతున్నాయి.
పీఆర్వోలూ అంతే..
రాజకీయ నాయకుల పిఏలే కాకుండా ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పిఆర్వోలుగా పనిచేసే వారి వ్యవహార శైలి కూడా ఇలాగే ఉంటుంది. మేడ్చల్ జిల్లాతో సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో, పోలీస్ కమిషనరేట్లు, హైడ్రా వంటి శాఖలకు సంబంధం ఉంది. ఈ డిపార్ట్మెంట్ లకు పిఆర్‌ఓలు ఉన్నారు. ఆయా డిపార్టుమెంటులకు సంబంధించిన సమాచారాన్ని పత్రికలకు విడుదల చేస్తారు.
ఇందులోని కొందరు పి ఆర్ ఓ ల వ్యవహార శైలి దూకుడుగా ఉంటుంది. ఏదైనా సమాచారం కోసం సంప్రదిస్తే దురుసుగా మాట్లాడుతారు. ఇప్పటికైనా పిఏల పై నిఘ పెట్టాలని, పీ ఆర్‌ఓల దురుసు ప్రవర్తనను తగ్గించేలా చూడాల్సిన అవసరం ఉంది.






