31 August, 2026 | 3:27 AM

కంగ్టి సిద్ధేశ్వర ఆలయంలో ఘనంగా గజస్తంభం ప్రతిష్ఠాపన

31-08-2026 02:30 AM

కంగ్టి, ఆగస్టు 30:  కంగ్టి మండలంలోని మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో వెలసిన ప్రాచీన కంగ్టి సిద్ధేశ్వర ఆలయం(Kangti Siddheshwara Temple) ఎదుట గజస్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక సిద్ధేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు.ఆలయ ధర్మకర్త తోతలా ప్రకాష్ సేట్ దంపతులు ముందుగా గజస్తంభం ప్రతిష్ఠాపన పూజలను నిర్వహించారు. అనంతరం గ్రామ పురోహితుడు అక్షయ్ జోషి వేదమంత్రాల నడుమ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని చేపట్టారు.

బాజా భజంత్రీల నడుమ భారీ క్రేన్ సహాయంతో నిర్వాహకులు గజస్తంభాన్ని ఆలయం ఎదుట ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులు గజస్తంభాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంగ్టి మండల ప్రజలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శివరుద్రప్ప, సిబ్బంది సంగమేశ్వర్, గ్రామ పెద్దలు విట్టల్ రెడ్డి పటేల్, మనోజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.