31 August, 2026 | 2:32 AM

కృష్ణాపై కొత్త లెక్క!

31-08-2026 01:22 AM

ప్రస్తుత డిమాండ్లపై పట్టు.. భవిష్యత్తు వాటాపైనా గురి

299 టీఎంసీలు కాదు.. 600 టీఎంసీలే లక్ష్యం

  1. సాగు, తాగు నీటిపైనా నూతన ప్రతిపాదన 
  2.     50:50 తాత్కాలికం.. శాశ్వత వాటాపై పోరాటం 
  3. మిగులు జలాలపైనా హక్కులకు వ్యూహం 
  4.     7న ఢిల్లీలో సీడబ్ల్యూసీతో భేటీ 
  5. న్యాయపరమైన ఆధారాలతో సిద్ధమవుతున్న అధికారులు

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): కృష్ణా జలాల(Krishna waters) వాటా విషయంలో తెలంగాణ సర్కార్(Telangana government) కొత్త వ్యూహంతో ముందుకెళ్లనుంది. ప్రస్తుత నీటి డిమాండ్లపై పట్టు కొనసాగిస్తూనే... భవిష్యత్తు అవ సరాలనే ప్రధాన ప్రాతిపదికగా చేసుకుని 600 టీఎంసీల వాటా కోసం బలమైన వాదన వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న ఢిల్లీలో జరగనున్న కేంద్ర జల సంఘం(Central Water Commissio) (సీడబ్ల్యూసీ) సమావేశానికి తెలంగాణ అధికారులు కొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నారు.

గతంలో ఎంత నీటిని వినియోగించామన్న లెక్కలకే పరిమితం కాకుండా.. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం, పెరుగుతున్న సాగు, తాగునీటి అవసరాలు, కొత్త ప్రాజెక్టులు(new projects), హైదరబాద్ భవిష్యత్తు తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని శాశ్వతంగా ఎక్కువ వాటా సాధించడమే లక్ష్యంగా వాదనలు వినిపించేందుకు సమగ్ర వివరాలు, న్యాయ ఆధా రాలతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

299 టీఎంసీల ప్రస్తుత వాటాపైనే వాదనలు కాకుండా.. తెలంగాణకు న్యాయ బద్ధంగా ఎంత నీరు అవసరమనే విషయా న్ని ట్రిబ్యునల్-2 ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వ్యూహం మార్చినట్లు సమాచారం. ప్రస్తుత 50:50 పంపకాల డిమాండ్‌ను కొనసాగిస్తూనే, దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా 600 టీఎంసీల వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలన్నది ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో సెప్టెం బర్ 1న సీడబ్ల్యూసీ సమావేశం తాజా నీటి పంపకాలపై చర్చకే కాకుండా.. తెలంగాణ భవిష్యత్తు జల హక్కుల దిశను నిర్దేశించే కీలక వేదికగా మారనుంది.     

న్యాయబద్ధ్దమైన వాటాపైనే వాదన..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్(Bachawat Tribunal) కేటాయించిన 811 టీఎంసీలలో రాష్ట్ర విభజన(State Bifurcation) తర్వాత తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలుగా పంపకం జరిగింది. కానీ. 299 టీఎంసీలనే శాశ్వత వాటాగా పరిగణిస్తే భవిష్యత్‌లో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వినియోగ జలాలు కాకుండా.. కృష్ణా నదిలో తెలంగాణకు న్యాయబద్ధం గా ఎంత రావాలన్నదే ట్రిబ్యునల్ ముందు ప్రధాన వాదనగా ఉంచాలని రాష్ట్రం భావిస్తోంది.

గతంలో ఒక ప్రాంతం ఎంత నీటిని వినియోగించింది అనే అంశానికి ప్రాధా న్యం ఉండేది. ఇప్పుడు తెలంగాణ తనకు అవసరమైన నీటి పరిమాణాన్ని ముందుగానే నిరూపించుకునే ప్రయత్నం చే స్తోంది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. హైదరాబాద్ నగరం విస్తరించింది. పారిశ్రామిక అవసరాలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరా లు పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో పాత వినియోగ లెక్కలతోనే భవిష్యత్ వాటాను నిర్ణయిం చకూడదని తెలంగాణ వాదించాల్సి ఉంటుంది. అందుకు కృష్ణా జలాల వాటాల విషయంలో కొత్త ఫార్ములాను రాష్ట్రం ముందుకు తీసుకెళ్లే ప్ర యత్నం చేస్తోంది. కృష్ణా నదీ పరివాహక ప్రాం తంలో తెలంగాణకు ఉన్న భౌగోళిక విస్తీర్ణం కూ డా ట్రిబ్యునల్ ముందు ప్రధాన అంశం కానుంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి తదితర ప్రాంతా లు కృష్ణా జలాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో చాలాకాలంగా సాగునీటి కొరత ఉంది. భూగర్భజలాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టులు పూర్తయినా.. వాటికి తగిన నీటి కేటాయింపులు లేక పోతే వాటి ప్రయోజనం పరిమితమవుతుంది. అందువల్ల కృష్ణా బేసిన్‌లో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత? ఆ ప్రాంతంలో ఎంత సాగుభూ మి ఉంది? ఎంత జనాభా ఉంది? ఎంత నీటి అవసరం ఉంది? అనే అంశాలను సమగ్రంగా చూపించాల్సిన అవసరం ఉంది.

ఒకవైపు బేసిన్ విస్తీర్ణం, న్యాయబద్ధమైన హక్కుల ఆధారంగా తెలంగాణకు మరింత ఎక్కువ వాటా రావాలని రాష్ట్రం వాదిస్తోంది. మరోవైపు ప్రస్తుత నీటి కొర త సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ఉమ్మడి జలాశయాల్లో 50:50 నిష్పత్తిలో నీటిని పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో అందుబాటులో ఉన్న నీటిని సమానంగా పంచుకోవాలని కోరుతూనే ట్రిబ్యునల్ ముందు మాత్రం దీర్ఘకాలికంగా తెలంగా ణకు రావాల్సిన వాటా ఎక్కువగా ఉండాలని వాదించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. 

మిగులు జలాలే లక్ష్యం..

గతంలో కృష్ణా నదిలో మిగులు జలాల లభ్య త ఆధారంగా రెండు రాష్ట్రాలు అనేక ప్రాజెక్టులను అభివృద్ధి చేశాయి. కానీ మిగులు నీటిపై శాశ్వత హక్కు, దాని వినియోగ విధానం విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. అం దుకే తెలంగాణ ఇప్పుడు చట్టబద్ధమైన కేటాయింపులను పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. మి గులు జలాలు వస్తే వాడుకోవడం అనే విధానానికి బదులుగా.. ముందుగా తెలంగాణ ప్రాజెక్టు లకు అవసరమైన నీటి కేటాయింపులు ఖరారు చేసి, ఆ తర్వాత మిగులు నీటి పంపకాలపై నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది.

తెలంగాణ తన భవిష్యత్ నీటి అవసరాలను నిరూపించడానికి ఉపయోగించుకునే ప్రధాన ఉదాహరణల్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ఒకటి. దక్షిణ తెలంగాణలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు.. తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి కేటాయింపులను ట్రి బ్యునల్ ముందు చట్టబద్ధం చేయడం తెలంగాణకు అత్యంత కీలకంగా మారింది. 

దీంతో పా టు హైదరాబాద్ జనాభా పెరుగుదల, నగరం చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా పట్టణీకరణ చెందడం, పారిశ్రామిక కారిడార్లు, కొత్త నివాస ప్రాంతాలు ఏర్పడుతుండటంతో భవిష్యత్‌లో నగరానికి మరింత తాగునీరు అవసరమవుతుం ది. ఇప్పటికే కృష్ణా జలాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషి స్తున్నాయి.

రాబోయే 20-30 ఏళ్ల అవసరాలను లెక్కలోకి తీసుకోకుండా కృష్ణా నీటి వాటా ను నిర్ణయిస్తే తెలంగాణకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతు న్నారు. అందుకే సాగు నీరు మాత్రమే కాదు.. తాగునీటి హక్కు కూడా అనే అంశాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.  

మూడు వేదికలే కీలకం..

తెలంగాణకు ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో మూడు వేర్వేరు వేదికలు కీలకంగా మారాయి. శాశ్వత నీటి హక్కును సాధించేందుకు ట్రిబ్యునల్ ముందు న్యాయపోరాటం చేయడం, కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలో ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల, విని యోగం, రిజర్వాయర్ల నిర్వహణ, ట్రిబ్యునల్ పరిధి, నిబంధనలు, రెండు రాష్ట్రాల మధ్య వివా ద పరిష్కారంలో కేంద్రం పాత్ర వంటి మూడు వేదికల్లో ఒకే రకమైన డేటా, ఒకే రకమైన తెలంగాణ వాదన ఉండేలా సమన్వయం చేయాల్సి ఉంటుంది.

తెలంగాణకు సుమారు 600 టీఎంసీల స్థాయిలో వాటా సాధించాలన్న లక్ష్యం చర్చలోకి రావడం ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం. 299 టీఎంసీలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడంతో ఈ డిమాండ్‌ను కేవలం రాజకీయంగా ప్రకటించడం కాకుండా నీటి లభ్యత, బేసిన్ విస్తీర్ణం, సాగు అవసరాలు, తాగునీరు, ప్రాజెక్టులు, భవిష్యత్ జనాభా, మిగు లు జలాలు వంటి ప్రతి అంశానికి బలమైన సాంకేతిక, న్యాయ ఆధారాలు చూపాల్సి ఉం టుంది.

అందుకే 600 టీఎంసీల డిమాండ్ కన్నా.. దాని వెనుక తెలంగాణ సమర్పించే డేటా, లెక్కలు, న్యాయపరమైన వాదనలు అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏపీ నుంచి కూడా వారి ప్రాజెక్టులు, సాగు విస్తీర్ణం, డెల్టా అవసరాలు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, ఇప్పటికే ఉన్న వినియోగం వంటి అం శాలపై బలమైన వాదనను ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందుకే తెలంగాణకు అదనపు నీరు ఎందుకు అవసరమో శాస్త్రీయంగా నిరూపించడం ఎంతో అవసరం. 

50:50 తాత్కాలిక పంపకాలు, 600 టీఎంసీల స్థాయిలో దీర్ఘకాలిక డిమాండ్, మిగులు జలాలపై హక్కు, ప్రాజెక్టులకు చట్టబద్ధమైన కేటాయింపులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు వంటి అంశాలు ఇప్పుడు తెలంగాణ వ్యూహంలో భాగమవుతున్నాయి. తీర్పు అనుకూలంగా వస్తే.. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులకు కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంది.