03-07-2025 01:01:42 AM
దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుతో కోల్పోనున్న ప్రభ
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే జోన్(ఎస్సీఆర్).. ప్రస్తుతం సరుకు రవాణాలో దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే జోన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల పరిధిలో భారీగా విస్తరించి ఉండే ఈ జోన్ త్వరలోనే తన ప్రాభవాన్ని కోల్పోనుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ జోన్ పరిధిని ఇప్పటివరకు రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించకపోయినా.. ఆ ప్రాంతంలో ఉన్న మూడు డివిజన్లతో పాటు కొత్తగా విశాఖ కేంద్రంగా మరో డివిజన్‌ను కూడా ఏర్పాటు చేసి 4 డివిజన్లతో విశాలంగా జోన్‌ను తీర్చిదిద్దేందుకు దాదాపుగా నిర్ణయం అయిపోయిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏమాత్రం జాగ్రత్త పడుతున్నట్లు కనిపించడం లేదు.
దాంతో ఏపీకి చెందిన కొందరు కూటమి నేతలు చాపకింద నీరులా రైల్వే జోన్ల విభజనపరంగా ఏపీకి ప్రయోజనం కలిగేలా చేస్తున్నారని తెలంగాణకు చెందిన రైల్వే వర్గాలు వాపోతున్నాయి. అయితే మన రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని, కొత్త డివిజన్ల ఏర్పాటుపై ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదని రైల్వే ప్రయాణికుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి, ద.మ.రైల్వేకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు.
కాజీపేట డివిజన్‌ను పట్టించుకోని పాపం
ఎస్సీఆర్ జోన్‌లో ప్రస్తుతం 6 డివిజన్లు ఉన్నాయి. వీటిలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లు ఉం టే.. మహారాష్ట్రలో నాందేడ్ డివిజన్ ఉన్నది. ఇక ఏపీలో వాల్తేర్, గుంటూరు, విజయవా డ, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. సమైక్య రా ష్ట్రంలోనే ఆంధ్రకు చెందిన పాలకులు తెలివి గా 4 డివిజన్లను ఏర్పాటు చేసుకున్నారు.
కానీ అప్పటి నుంచి మన ప్రాంత పాలకుల్లో క నీసం కాజీపేటను డివిజన్ చేసుకునాలనే ఆ లోచన రాలేదు. ఎప్పటి నుంచో డిమాండ్ గా ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అ నేది కలగానే ఉండిపోయింది. ఆనాడే కాజీపేట డివిజన్ ఏర్పాటై ఉంటే ఇప్పుడు జోన్ విభజన తర్వాత ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.
దక్షిణ కోస్తాకు ఇప్పటికే 4 డివిజన్లు
కేంద్రం నుంచి నిధులు రాబట్టాలన్నా, కేంద్ర సంస్థలను తీసుకురావాలన్నా ఏపీ నేతలే ముందుంటారని మరోసారి నిరూప ణ అవుతోంది. జోన్ ఏర్పాటు కోసం చా లా కాలంగా ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. కొత్తగా విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేర్, గుంటూరు, విజయవాడ, గుంతకల్ రైల్వే డివిజన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు పునర్విభజన నేపథ్యంలో డివిజన్ల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి.
ఆ ప్రకారం పునర్వి భజన తర్వాత దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లు ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడున్న వాల్తేరు, గుంతకల్, గుం టూరు, విజయవాడ డివిజన్లు దక్షిణ కోస్తా జోన్‌లోకి వెళతాయి. అలాగే తెలంగాణ, కర్ణాటకలోని కొంత ప్రాంతాన్ని కూడా దక్షి ణ కోస్తా పరిధిలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికైనా కాజీపేట, రాయచూర్ సాధించాలి..
రైల్వేపరంగా తెలంగాణకు పెద్దగా ప్రయోజనాలు ఎప్పుడూ కలగలేదు. అన్నీ ఆంధ్రా కే తరలివెళ్లాయి. పేరుకే జోన్ హెడ్ క్వార్టర్‌గా ఉన్నా.. ఇక్కడ కూడా ఆంధ్రా అధి కారులు, కార్మిక సంఘాల నేతలదే పెత్తనం. ఇప్పుడు జోన్ విభజన సందర్భంగా కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా దెబ్బతీసి గంపగుత్తగా ఏపీకి ప్రయోజనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో మన అధికారులు ముం దస్తు జాగ్రత్తలు తీసుకుని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వా సులు కోరుతున్నారు. అలాగే జోన్ సామర్థ్యాన్ని పెంచేందుకు తెలంగాణ సరిహద్దుల్లో ఉండే రాయచూరులో మరో డివిజన్ ఏర్పా టు చేయాలని, అందుకోసం కర్ణాటక ఎం పీల సహకారం తీసుకుని ప్రయత్నం చేస్తే రెండు డివిజన్లు సాధించే అవకాశం ఉందని రైల్వే వినియోగదారుల సంఘం నేత నూర్ విజయక్రాంతికి తెలిపారు.
శరవేగంగా విభజన కసరత్తు
కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్‌కు ఇప్పటివరకు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం ) స్థాయి అధికారి ఉండగా... ఇటీవలే జనరల్ మేనేజర్ (జీఎం)గా సందీప్ మాథుర్‌ను రైల్వేబోర్డు ఐదు రోజుల క్రితం నియమించింది. ఈ కీలక పరిణామంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పునర్విభజన ప్రక్రియ వడివడిగా ముందుకు వెళ్తున్నట్లుగా భావించాలని రైల్వే వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే స్వరూపం
* డివిజన్లు- సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, వాల్తేర్, గుంటూరు, విజయవాడ, గుంతకల్
* జోన్ పరిధిలోని రాష్ట్రాలు- తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు
* విస్తీర్ణం- 6,400 కి.మీ (జోన్ విభజన తర్వాత ద.మ. రైల్వే పరిధిలో మిగిలేది 2,500 కి.మీ)
* ప్రయాణికుల సంఖ్య- రోజుకు సుమారు 12 లక్షలు ( జోన్ విభజన తర్వాత 5 లక్షలకు తగ్గే అవకాశాలు)
* ప్రస్తుతం రాకపోకలు సాగించే రైళ్లు- సుమారు 650
* ప్రయాణికుల ద్వారా ఆదాయం- రోజుకు రూ. 2.5 కోట్లు
* సిబ్బంది- 92 వేలు.
* మొత్తం గూడ్స్ రైళ్లు- 70 వరకు
* సరుకు రవాణా ఆదాయం- ఏడాదికి సుమారు రూ.15వేల కోట్లు