‘చప్రాసి సార్’.. బాలయ్య !
‘చప్రాసి సార్’.. వినడానికి ఈ పేరు కొత్తగా ఉంది కదా. ఇదొక పుస్తకం టైటిల్. ఈ టైటిల్ చదివిన ప్రతిఒక్కరికీ ఎవరీ చప్రాసి..? ఆయన్ను అందరూ ఎందుకు సార్ అనిపిలుస్తారు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అందుకు సధానం తెలియాలంటే ఒక్కసారి ఈ ‘చప్రాసి సార్’ పుస్తకం చదవాల్సిందే.
అక్షరం ముక్క రాని ఒక్క సాధారణ పల్లెటూరు వ్యక్తి ఒక పాఠశాలలో చప్రాసిగా పనిచేస్తూ .. సర్ అని పిలిపించుకునే స్థాయికి ఎలా ఎదిగాడనేదే ఈ పుస్తక సారాశం. ఆ చప్రాసి పేరే గజ్జల బాలయ్య. నేటి మహబూబాబాద్ జిల్లా (నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా) కురవిలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక చిన్న ఉద్యోగి బాలయ్య. ఇంతకీ పాఠశాలలో ఆయన పనులేంటంటే.. బడికి రాని పిల్లలను ఇంటికి వెళ్లి, తిరిగి బడికి తీసుకురావడం, ఇంకా.. బడిలో ఏమైనా చిన్న చిన్న పనులు చేయడం. అలాంటి బాలయ్య ఎంతోమంది పిల్లల ఎదుగుదలకు దోహదం చేశారు. సాధారణ ప్రజజలు, పెద్దలు, ప్రభుత్వ అధికారులతోసర్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. ఈ పుస్తకాన్ని బాలయ్య కుమారుడు, ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం వెలువరించారు.
అయితే... రామేశ్వరమే స్వ యంగా తన తండ్రి గురించి రాయొచ్చు. కానీ, రామేశ్వరం ఆ పని చేయలేదు. నాడు బాలయ్య పనిచేసిన పాఠశాలలో చదువుకుని విద్యావంతులై దేశ విదేశాల్లో స్థిరపడిన వారి అభిప్రాయాల మాలికతో పుస్తకం వెలువరించారు. అందుకే రామేశ్వరం ధన్యుడు. గజ్జల బాలయ్య 1930 సెప్టెంబర్ 1న ప్రభుత్వ పాఠశాలలో చప్రాసిగా ఉద్యోగంలో చేరారు. నాటి నిజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన పేదరికం ఉండేది. దొరలు, జ మీందార్లు, అగ్రకులాల వారి పిల్లలు తప్ప సామాన్యులకు చదువుకునే అవకాశం దక్కే ది కాదు.
ప్రభుత్వ పాఠశాలలు చాలా తక్కువగా ఉండే వి. ఇక ప్రైవేటు పాఠశాలలనే మాటే లేదు. కురవి పాఠశాలలో కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే ఉర్దూ మా ధ్యమంలో విద్యాబోధన సా గేది. బడి ఉన్నా కూడా పిల్లలను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించేవారు కాదు. మగపిల్లలు వ్యవసాయ పనులు చేస్తే చాలనే ధోరణి ఉండేది. ఇక బాలికల విద్య ఊసే లేదు. స మాజంలో బాల్యవివాహా లు, అంటరానితనం వంటి ఘోరమైన మూఢనమ్మకాలు రాజ్యమేలేవి. అంటరా నితనం వేళ్లూనుకున్న కాలమది. దళితులు ఊరి చివర గూడెంలో ఉండేవారు.
అలాంటి అంధకార బంధుర సామాజిక పరిస్థితుల్లో బాలయ్య గ్రామంలో అక్షర జ్యోతి వెలిగించేందుకు సంకల్పించాడు. బాలయ్య రూపం ఇప్పటికీ నాటి విద్యార్థుల కళ్లల్లో మెదులుతూనే ఉంటుంది. బాలయ్య ఎప్పుడు తలకు రుమాలు చుట్టుకునేవాడు. బడి ఎగ్గొట్టే పిల్లలను గుర్తించేవాడు. పిల్లలు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టకుండా వెతికి పట్టుకునేవాడు. బుజ్జగించి మరీ వారిని బడికి తీసుకువచ్చేవాడు. వీలు కానప్పుడు ఎత్తుకుని మరీ బడికి లాక్కొచ్చేవాడు. చప్రాసి వస్తున్నాడంటే చాలు పిల్లలు భయంతో ఇళ్లకు దూరంగా పరిగెత్తేవారు.
ఆ రోజుల్లో కురవి పాఠశాలకు ముత్యం పోచంపల్లి, తిరుమలాపురం, ముగ్గుళ్లపల్లి, రాజాపేట, మర్రిరామగూడెం లాంటి సుమారు ముప్పు గ్రామాల నుంచి పిల్లలు వచ్చేవారు. ఆయా తండాల నుంచి వచ్చే లంబాడీ పిల్లలు ప్రతిరోజు నడుచుకుంటూ వచ్చి చదువుకునేలా బాలయ్య నిరంతరం పర్యవేక్షించేవాడు. పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగించడమే కాకుండా పైచదువుల కోసం జిల్లా కేంద్రమైన మానుకోటకు వెళ్లేలా ప్రోత్సహించేవాడు. బాలయ్య ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు పాఠశాల పనుల్లోనే నిమగ్నమయ్యేవాడు.
బడికి రాని విద్యార్థుల ఇళ్లకు నిరంతరం వెళ్లేవాడు. విద్యార్థులు బడికి వచ్చారో లేదో అత్యంత శ్రద్ధగా కనుగొనేవాడు. ఒక సాధారణ చప్రాసి తన విధి నిర్వహణలో చూపిన ఈ గురుతర బాధ్యత అందరినీ ఆశ్చర్యపరిచేది. దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దాడు. బాలయ్య సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఆయన కుమారుడు ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం అపురూపమైన ఈ పుస్తకాన్ని తెచ్చారు.
నాటి విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రత్యక్ష అనుభవాలను సేకరించి ఈ పుస్తకాన్ని ముద్రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పుస్తకానికి ముందుమాట రాశారు. లండన్ లాంటి విదేశాల్లో స్థిరపడిన నాటి విద్యార్థులు సైతం నేటికీ బాలయ్యను చప్రాసి సార్ అని భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటున్నారు. ఆయన చూపిన నిస్వార్థ సేవాతత్పరత నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అందుకు ఈ పుస్తకం గొప్పగా దోహదపడుతుంది.






