స్తబ్దుగా వీసీల నియామక ప్రక్రియ
- కుదరని సామాజిక సమీకరణాలు!
- సెర్చ్ కమిటీల భేటీపై ఇంకా రాని స్పష్టత
- అందుకే ప్రక్రియ ముందుకు సాగడం లేదని టాక్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకానికి ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. సెర్చ్ కమిటీల సమావేశానికి ఇంతవరకూ తేదీలు ఫైనల్ కాలేదని తెలుస్తోంది. సెర్చ్ కమిటీలు సమావేశమై వీసీల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. కానీ ఇంత వరకు సెర్చ్ కమిటీల భేటీకి ముహూర్తమే కుదరలేదు. అసలవి ఎప్పుడు జరుగుతాయో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. దీంతో నెలాఖరు వరకు ఇన్‌చార్జి వీసేలే కొనసాగనున్నారు.
కుదరని సమీకరణాలు...
వీసీల నియామకానికి తీవ్ర పోటీ నెలకొన్నది. మరోవైపు సామాజిక సమీకరణాలు ఇంకా కుదరలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీసీల నియామకానికి ఆలస్యమ వుతోందనే చర్చ విద్యావర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఏ యూనివర్సిటీకి ఏ సామాజిక వర్గానికి కేటాయించాలి? ఎవరైతే బాగుంటుందనే పేర్లను ప్రభుత్వపెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉస్మానియా, జేఎన్టీయూ, అంబేడ్కర్, మహాత్మాగాంధీ, కాకతీయ యూనివర్సిటీతోపాటు మిగతా విశ్వవిద్యాలయాల వీసీల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఆశావహులు జోరుగా తమకు తెలిసిన మార్గాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా సెర్చ్ కమిటీల భేటీకి ముందే యూనివర్సిటీల వారీగా పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఇస్తే సామాజిక, రాజకీయపరంగా తమకు కలిసొస్తుందనే అంశాలను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందుకే వీసీల ఎంపికపై తుది నిర్ణయానికి సర్కారు రాలేదని తెలుస్తోంది. పలువురు ఆశావహులు ఏకంగా తమ జిల్లాల మంత్రుల వద్దకు వెళ్లి ఫలాన యూనివర్శిటీకి తమ పేరును సిఫారసు చేయాలని విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నట్లు టాక్.
ఈ నెలాఖరులోగా...
గత మే నెల 21వ తేదీతో రాష్ట్రంలోని పది యూనివర్శిటీల వీసీల పదవీకాలం ముగిసింది. ఆ సమయంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కొత్త వీసీల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేకపోయింది. దీంతో ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జి వీసీలుగా ప్రభుత్వం నియమించింది. ఈ నెల 15వ వరకు లేదా కొత్త వీసీలను నియమించే వరకు ఇన్‌చార్జిలుగా వీరు కొనసాగుతారని ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దాదాపు ఈ నెల 15వ తేదీలోపు సెర్చ్ కమిటీలు సమావేశమై కొత్త వీసీలను నియమిస్తామని గతంలో పలు సందర్భాల్లో విలేకరులతో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. నేటితో ఆ గడువు ముగియనుండడంతో శుక్రవారం రాజ్‌భవన్‌లో చిట్‌చాట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా కొత్త వీసీలు నియామకం అయ్యే అవకాశం ఉందన్నారు.
భేటీపై త్వరలో నిర్ణయం
వీసీ పోస్టులకు 1,392 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో వర్సిటీ తరుఫున ఒక్కో సెర్చ్ కమిటీ ముగ్గురు పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే సెర్చ్ కమిటీలను నియమించి నెలరోజులవుతోంది. ఇన్‌చార్జిల పదవీకాలం నేటితో ముగుస్తున్నా సెర్చ్ కమిటీల సమావేశాల తేదీలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. సెర్చ్ కమిటీల భేటీపై ఒకట్రెండు రోజుల్లో విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది.






