13-07-2025 12:35:24 AM
‘మేలుకొలుపు’ గంటగా పేరు
ఆ ఊరిలోని గంట 50 ఏళ్లుగా మోగుతూనే ఉంది. అప్పట్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమయాన్ని తెలపడానికి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1975 సంవత్సరంలో కంచు గంటను ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి 50 ఏళ్లుగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమయాన్ని తెలపడానికి కంచు గంటను ఇప్పటికీ వినియోగిస్తున్నారు.
ఇప్పట్లా కాకుండా అప్పట్లో సమయం తెలిపేందుకు అందరికీ గడియారాలు ఉండేవి కావు. దీనితో పాఠశాలకు విద్యార్థులను రప్పించేందుకు ‘మేలుకొలుపు’గా గంట మోగించేవారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన గ్రామంగా పేరు ఉన్న ఇనుగుర్తిలో ఊరంతా టంగుటంగు శబ్దం చేస్తూ వినిపించే విధంగా ప్రత్యేకంగా కంచు గంటను తయారు చేయించారు. అప్పటినుంచి ఇప్పటికీ అదేవిధంగా కంచు గంట ఘన ఘన మోగుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమయాన్ని సూచిస్తోంది.
బండి సంపత్‌కుమార్, మహబూబాబాద్