13-07-2025 12:36:35 AM
- ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన కోమటిరెడ్డి, పొన్నం
- అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నల్లగొండ టౌన్, జూలై 12: నల్లగొండ జిల్లాలో శనివారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని బస్ స్టేషన్‌లో ఎలక్ట్రిక్ బస్సులను శనివారం మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డితో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నల్లగొండ జిల్లాకు 77 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కాగా రిజిస్ట్రేషన్ పూర్తయిన 40 బస్సులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు బస్సు నడిపి ఆశ్చర్యపరిచారు. బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బస్సులో ప్రయాణం చేశారు. దండంపల్లి వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర అదనపు హాలును ప్రారంభించారు. మాడుగుల పల్లి మండల కేంద్రంలో సమీకృత మండల కార్యాలయ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వాహన ప్రమాదాలు చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్తులో చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. వాహనాల వెనకవైపు రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీవో తీసుకురానున్నమని వెల్లడించారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వాహనం ఫిట్నెస్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఉపయోగపడుతుందని అన్నారు. రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటి 8 కోట్ల రూపాయల వ్యయంతో 17 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నల్లగొండలో ఏర్పాటు చేసినది తెలంగాణలోనే రెండవదని తెలిపారు.
భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్‌లను ఆటోమేటిక్‌గా నిర్వహించి ఆ టెస్ట్ లో పాస్ అయితేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వలన 20 నెలల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు.
నల్గొండ జిల్లాకు 70 ఎలక్ట్రిక్ బస్సు లు ఇవ్వగా, 10 బస్సులు నార్కెట్‌పల్లికి, తక్కినవి ఇతర ప్రాంతాలకు తిప్పనున్నట్లు వెల్లడించారు. నార్కెట్‌పల్లికి 80 కొత్త బస్సులు కావాలని, అలాగే నార్కట్‌పల్లికకి నూతన డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రిని విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రభాకర్ ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి అని, తాము ఇద్దరం తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో పొన్నం ప్రభాకర్ కేబినెట్‌లో కొట్లాడారని చెప్పారు. కార్యక్రమంలో మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.